KTR
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈ కార్ రేస్ కేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరితే పారిపోయారని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తాను తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. ఈ ఫార్ములా కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్నారు.
‘నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మధ్య చర్చిద్దామని అసెంబ్లీలో అడిగితే రేవంత్ రెడ్డి పారిపోయారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని అన్నప్పటికీ పత్తా లేరు. మళ్లీ విచారణకు పిలిచినా చట్టంపై గౌరవంతో వెళ్లాను. ఉదయం నుంచీ ఒకటే ప్రశ్న తిప్పి తిప్పి అడిగారు. ఒక్కపైసా కూడా అవినీతి జరగలేదు. అవినీతి ఎక్కడుందని ఏసీబీ అధికారులను అడిగాను. పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలు తప్ప విచారణలో ఏమీ లేదు. పరిపాలన చేయకాదు, హామీలు నెరవేర్చే దమ్ము లేదు. చేతకాని రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రైతుభరోసా నిధులు విడుదల.. 9 రోజుల్లో 9వేల కోట్లు..
కేసీఆర్, హరీశ్ ను కూడా కమిషన్ ముందుకు పిలిచారు. తాను జైల్లో ఉన్నాడు కాబట్టి, మమ్మల్ని కూడా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నాడు. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండని ఏసీబీ అధికారులకు కూడా చెప్పా. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటాను. ఇంకో 1400 కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడేది లేదు. పైనుంచి ఆదేశాలు, ఏం చేయాలి అని అధికారులు అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను చిత్తుచిత్తుగా ఓడిద్దాం. 21వ తేదీతో కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసి ఆరేళ్లు అవుతుంది. ప్రాజెక్ట్ గొప్పతనం చేసేలా కార్యక్రమాలు చేద్దాం. నేను సీఎంను ఏదో అంటే బాధ పడ్డారట. తెలంగాణ ముఖ్యమంత్రిగా జై తెలంగాణ అనని, రాష్ట్ర ప్రతిష్టను తీస్తున్న వ్యక్తిని ఏమనాలి?” అని విరుచుకుపడ్డారు కేటీఆర్.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండోసారి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసులో సుమారు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్ ను విచారించారు. ఎఫ్ఈవోతో ఒప్పందాలు, నగదు లావాదేవీలపై కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. హెచ్ఎండీఏ నిధుల అంశంపైనా కేటీఆర్ ను విచారించారు.