Telangana Govt : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. వారందరికీ ఉచిత ప్రవేశం..

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది.

Telangana Government schools students

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • సర్కారు బడి విద్యార్థులకు తీపి కబురు
  • సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యార్థులకు మన దేశ సంస్కృతి, పూర్వీకుల వారసత్వ సంపదపై స్పష్టమైన అవగాహన కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనుంది. అంతేకాదు.. గుర్తింపు పొందిన ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులుకూడా ఈ ఉచిత అవకాశాన్ని వినియోగించుకొని మ్యూజియాన్ని సందర్శించొచ్చు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.

Also Read : Hyderabad: లగ్జరీ విల్లాల రాజధానిగా హైదరాబాద్.. రూ.8,562 కోట్ల విక్రయాలతో టాప్ పొజిషన్.. బెంగళూరు, చెన్నై సిటీలు అవుట్

2026-27 విద్యా సంవత్సరంలో విద్యా విహారయాత్రలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను స్కూల్ ఎడ్యుకేషన్ జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం.. ఈ విహారయాత్రల ప్రక్రియ మొత్తాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో నికోలస్ స్పష్టం చేశారు. అయితే, విహారయాత్రల ఎంపికలో తొలి ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు కల్పించాలని డీఈఓలకు సూచించారు.

ప్రపంచ ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియంలో ఆసియా, ఐరోపా, దూర ప్రాచ్య దేశాలకు చెందిన వేలాది ప్రాచీన నాణేలు, ఆయుధాలు, తివాచీలు, హస్తకళలు, చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచారు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో సందర్శకులు మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు. చిన్నతనం నుంచే చారిత్రక అంశాలు, కళలపై ఆసక్తి పెంపొందించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పుడుతందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ నిబంధనలు తప్పనిసరి..
సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శించాలనుకునే పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు కనీసం 48గంటల ముందే education.salarjungmuseum@gmail.com అనే అధికారిక ఈ-మెయిల్ ఐడీ ద్వారా సమాచారం అందించి ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాక.. విద్యార్థుల భద్రత, క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ కఠినమైన నిబంధనలను విధించింది. విహారయాత్రకు వెళ్లే ప్రతీ 30మంది పిల్లల గ్రూప్ కు కనీసం ఒక ఉపాధ్యాయుడు తప్పసరి అని స్పష్టం చేసింది. విహారయాత్రకు ముందు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి పత్రాలు తీసుకోవటం తప్పనిసరి అని విద్యాశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.