Gadwal district Tejeshwar Case
Tejeswar Murder case: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గద్వాల ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. ఈ హత్యకేసులో ప్రధాన నిందితులు ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేష్, ఏ4 చాకలి పరుశురాముడు, ఏ5 చాకలి రాజులను విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో మూడు రోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హత్యకు దారితీసిన అంశాలను నిందితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో హత్యకు గురైన తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ప్రధాన నిందితుడు తిరుమలరావు మధ్య గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోందని పోలీసులు గుర్తించారు.
మూడు రోజుల పోలీసుల కస్టడీలో నిందితులు చెప్పిన వాంగ్మూలం, సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో హత్యకు గల కారణాలు వెల్లడించారు. అయితే, తేజేశ్వర్ ఉంటున్న బెడ్ రూంలో స్పై కెమెరా ఉన్నట్లు నిందితులు చెప్పడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు. అనుకున్న ప్రకారం.. నెల వ్యవధిలో తేజేశ్వర్‌ను హత్య చేయాలనే లక్ష్యంతో పథకం వేసినట్లు చెప్పారు. హత్యచేసి కొన్ని రోజులు లడాఖ్ లేదా అండమాన్‌లో స్థిరపడాలనే ప్రణాళిక రచించినట్లు తిరుమల రావు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది.
తేజేశ్వర్‌ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన సుపారీ గ్యాంగ్.. కారులోనే అతన్ని హత్య చేశారు. ఆ సమయంలో అన్నా.. నన్నెందుకు చంపుతున్నారు..? నన్ను వదిలేయండి.. అని తేజేశ్వర్ సుపారీ గ్యాంగ్‌ను ప్రాధేయపడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో ఐశ్వర్యను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటి వారెంట్‌ను కోర్టుకు సమర్పించారు. నేడోరేపో ఏ-2 ఐశ్వర్యను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించే అవకాశం ఉంది. అయితే, తేజేశ్వర్ హత్యకేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
తేజేశ్వర్ కనిపించకుండా పోయిన తరువాత అతని కుటుంబ సభ్యులు కలత చెంది, కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సమయంలో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ముఖంలో ఏ మాత్రం బాధ కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఐశ్వర్య గదిలో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు గ్లిజరిన్ సీసాను గుర్తించారు. తేజేశ్వర్ హత్య విషయం తెలిసిన తరువాత ఎవరికి అనుమానం రాకుండా కన్నీళ్లు వచ్చేలా కంట్లో గ్లిజరిన్ వేసుకొని నటించిందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ విషయంపై గద్వా సీఐ మాట్లాడుతూ.. గ్లిజరిన్ సీసాను స్వాధీనం చేసుకున్నామని, తేజేశ్వర్ కుటుంబీకుల ఆరోపణల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.