మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్… హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేత..

జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Hyderabad Twin Reservoirs : కుండపోత వానలతో హైదరాబాద్ నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ఉస్మాన్ సాగర్ లోని 2 గేట్లు, హిమాయత్ సాగర్ లోని ఒక గేటును ఎత్తి దిగువున ఉన్న మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇక ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, హిమాయత్ సాగర్ కు 1400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు వెల్లడించారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్.. మరోసారి పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. వరద నీరు ఇంకా పెరిగితే ఇబ్బంది అవుతుందని, గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రధానంగా 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు ప్రతిరోజు పైనుంచి వస్తున్న వరద నీరు ఒకానొక దశలో 3వేల క్యూసెక్కులకు చేరింది. ఆ తర్వాత కొంత వర్షం తగ్గడంతో వరద నీటి ఇన్ ఫ్లో తగ్గింది.

Also Read : విజయవాడలో వరద విలయం.. ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు

జంట జలాశయాల పూర్తి స్థాయి నీటి మట్టాలను పరిశీలిస్తే.. ఉస్మాన్ సాగర్ లో పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787 అడుగులుగా ఉంది. ఈ రిజర్వాయర్ నీటి మట్టం మొత్తం 3.9 టీఎంసీలు కాగా వరద నీరు 3.4 టీఎంసీలుగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉస్మాన్ సాగర్ లోని రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. దీని ద్వారా 224 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

ఇక హిమాయత్ సాగర్ కు సంబంధించి పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1761.10 అడుగుల వరకు నీరుంది. ఇందులో 2.97 టీఎంసీల నీరు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 2.45 టీఎంసీల నీరుంది. రాబోయే నాలుగైదు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. హిమాయత్ సాగర్ లోని ఒక గేటు ఎత్తారు. వరద నీరు ఎక్కువ అయితే జంట జలాశయాలకు సంబంధించి మరికొన్ని గేట్లను కూడా అధికారులు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు