ghmc act: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో 5 ప్రధాన సవరణలు చేసినట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారు.
సవరణ 1: మహిళలకు 50శాతం సీట్లు
సవరణ 2: పచ్చదనం కోసం బడ్జెట్ లో 10శాతం నిధులు
సవరణ 2: 85శాతం మొక్కలు బతకాలి, ఆ బాధ్యత కార్పొరేటర్లదే
సవరణ 3: డివిజన్లలో 4 రకాల వార్డు కమిటీలు
సవరణ 3: యూత్, సీనియర్ సిటిజన్స్, మహిళా, ఎమినిటీస్ కమిటీలు
సవరణ 3: ఒక్కో కమిటీలో 25మంది, ప్రతి కమిటీలో 50శాతం మంది మహిళలు
సవరణ 4: జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్లు రెండుసార్లు అమలు
సవరణ 5: రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా ఐదవ చట్ట సవరణ చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరణ తీసుకొచ్చిందని, ఇది దేశంలోనే మొదటిసారి అని కేటీఆర్ అన్నారు. ఇక రాష్ట్రంలో హరితహారం వల్ల పచ్చదనం పెరిగిందని కేంద్ర నివేదిక తెలిపినట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే పచ్చదనంపై బడ్జెట్‌లో కేవలం 2.5శాతం మాత్రమే కేటాయింపు ఉందని, దాన్ని 10 శాతానికి పెంచడం వల్ల మరింత పచ్చదనం పెరిగుతుందని అన్నారు. 85 శాతం మొక్కలు దక్కేలా జవాబుదారీతనం పెరగాలని, దానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడం కూడా ఉపకరిస్తుందని ఆయన అన్నారు.
ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరగాల్సిన అవసరం ఉందని, అందుకోసమే తాము చట్ట సవరణ చేస్తున్నామని మూడో చట్ట సవరణను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. ఇక రిజర్వేషన్ల కేటాయింపు ఐదేళ్లకోసారి మారడం వల్ల జవాబుదారీతనం ఉండడం లేదని, దీనిని 10 ఏళ్లకు పొడగిస్తే జవాబుదారీతనం పెరుగుతుందనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్లు రెండు పర్యాయాలు కొనసాగేలా చట్ట సవరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చివరిగా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ ఒక మహానగరంగా, విశ్వనగరంగా ఎదగడానికి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి 429 సంవత్సరాల కిందట బీజం పడింది. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా, 1933లో చాదర్‌ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్పడింది. 1948-56 మధ్య కాలంలో హైదరాబాద్ స్టేట్‌గా ఉన్నప్పుడే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. హెచ్ఎంసీ యాక్ట్ కింద నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు సంకల్పించ లేదు. కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన వారికి లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన ఐదు సవరణలు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.
హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 5 నుంచి 6శాతం పచ్చదనం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో హరితవనాలు పెంచేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ యాక్ట్ లో 5 ప్రధాన సవరణలు చేసినట్టు తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతో కూడిన పాలన కోసం 4 రకాల వార్డు కమిటీలు నియామకం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్ లో నాలుగు కమిటీలు ఉంటాయన్నారు. ఒక్కో కమిటీలో 25మంది ఉంటారని చెప్పారు. ప్రతి కమిటీలో 50శాతం మంది మహిళలు ఉంటారన్నారు.
తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు మంగళవారం(అక్టోబర్ 13,2020) ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. బిల్లులకు ఇప్పటికే మంత్రి మండలి ఆమోద ముద్రవేసింది.
సభలో ప్రవేశపెట్టిన బిల్లులు :
1. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020
2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020
3. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – 2020
4. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.