జీహెచ్ఎంసీ ఎన్నికలు…పోలింగ్ కేంద్రాల తుది జాబితా

  • Publish Date - November 22, 2020 / 08:30 AM IST

GHMC elections polling stations list : హైదరాబాద్ మహానగర పాలిక ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ విడుదల చేశారు. గ్రేటర్‌లో మొత్తం 9,101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కొండాపూర్ డివిజన్‌లో అత్యధికంగా 99 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. అత్యల్పంగా రామచంద్రాపురం డివిజన్‌లో 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.



పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ విడుదల చేశారు. ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలుంటే ఈ నెల 17వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. దీంతో వచ్చిన క్లెయిమ్‌లను పరిశీలించి ఇవాళ తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటించారు. గతంలో 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో సుమారు ప్రతి వెయ్యి మందికి ఒకటి కేటాయించారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 9,101కి పెరిగింది.



గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈసారి కూడా 2016 ఎన్నికల నాటి రిజర్వేషన్లనే అమలు చేస్తున్నారు. అత్యధికంగా జనరల్ కేటగిరీకి 88 స్థానాలు కేటాయించారు. బీసీలకు 50, ఎస్సీలకు 10, ఎస్టీలకు 2 స్థానాలను రిజర్వ్ చేశారు. వీటన్నింటిలో ఎన్నికల కమిషన్ 50 శాతం మహిళలకు రిజర్వ్ చేసింది.