Hyderabad: హైదరాబాద్‌లో రూ.5కే బ్రేక్‌ఫాస్ట్.. ఇందిరా క్యాంటీన్లు వచ్చేస్తున్నాయ్..

జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా క్యాంటీన్ల ద్వారా రూ.5కే బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు..

Hyderabad

Hyderabad Breakfast: గ్రేటర్ హైదరాబాద్ లో పేదలకు ప్రభుత్వం రూ.5కే భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. అయితే, తాజాగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాల పేరు మార్చేందుకు నిర్ణయించింది. ఇక నుంచి అవి ఇందిరా క్యాంటీన్లుగా మారనున్నాయి. ప్రస్తుతం ఆ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. ఇకనుంచి ఉదయం కూడా అల్పాహారం అందించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో కొద్దిరోజుల్లోనే ఇందిరా క్యాంటీన్ల ద్వారా రూ.5కే బ్రేక్ ఫాస్ట్ అందుబాటులోకి రానుంది.

Also Read: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. చివరి తేదీలు ఇవే..

నిరుపేదల ఆకలి తీర్చాలనే ఉదాత్త ఆశయంతో జీహెచ్ఎంసీ హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తో కలిసి రూ.5కే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజన అందిస్తుంది. ప్రస్తుతం 128 కేంద్రాల ద్వారా ఈ సదుపాయం అందుబాటులో ఉండగా.. 11 కేంద్రాలు సీటింగ్ సదుపాయాలతో ఉన్నాయి. ఈ కేంద్రాలను, మిగతా కేంద్రానలు పునరుద్దరించడంతోపాటు.. వీటికి ఇందిరా క్యాంటీన్లుగా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భోజనం అందిస్తుండగా.. ఉదయం పూట రూ.5కే బ్రేక్ ఫాస్ట్ సదుపాయం కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గురువారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

ఇందిరా క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ గా ఎలాంటి ఆహారం అందిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇండ్లీ, ఉప్మా వంటి టిఫిన్లు మాత్రమే అందిస్తారా.. దోస, పూరీ, బోండా వంటి టిఫిన్స్ కూడా అందుబాటులో ఉంచుతారా అనేది వేచి చూడాల్సిందే.