Singareni Workers : సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. నెరవేరనున్న కల.. రెవెన్యూ శాఖ ఉత్తర్వులు

Singareni Workers : తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేలా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

Singareni Workers

Singareni Workers : తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేలా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో దశాబ్దాల క్రితమే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న భూ హక్కుల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను 45 రోజుల్లో పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : LPG Cylinder eKYC : గ్యాస్ బుక్ చేస్తున్నారా? అక్టోబర్ 1 నుంచి ఈ పని చేయకపోతే రాయితీ సిలిండర్ కట్! వెంటనే ఇలా చేయండి

అసెంబ్లీలో 22-ఏ భూముల అంశంపై జరిగిన చర్చ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 జులై 11న జారీ చేసిన జీవో 76, 2023 మార్చి 17న జారీ చేసిన జీవో 28కు అనుగుణంగా పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఆదేశించారు. అంతేకాదు.. పెండింగ్‌ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్‌ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సింగరేణి సంస్థ నామినేట్‌ చేసిన ప్రతినిధితో పాటు జిల్లా రిజిస్ట్రార్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

దరఖాస్తుల పరిశీలన సమయంలో ఏవైనా అక్రమాలు, నిబంధనలకు విరుద్ధమైన అంశాలు గుర్తిస్తే.. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. భూములకు సంబంధించిన కేసుల్లో ఇప్పటికే ఏవైనా కోర్టు ఉత్తర్వులు ఉన్నట్లయితే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని, అర్హత, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం పెండింగ్‌ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఈ ఆదేశాలను పంపింది.

దశాబ్దాలుగా సింగరేణి భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పెండింగ్‌ దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.