Telangana RTC Employees : తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. చిరకాల కోరిక నెరవేరబోతోంది..
Telangana RTC Employees : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
- Harish Thanniru
- Published on- July 24, 2026 / 08:00 AM IST
Telangana RTC Employees
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
- ప్రభుత్వంలో విలీనం ప్రక్రియపై కసరత్తు
- తొలుత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు
Telangana RTC Employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, అనంతరం విలీన ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మెలో ప్రభుత్వంలో విలీనం సహా 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు కల్పించాలని, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరాయి. వీటిలో ఎక్కువశాతం డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి చేసి, విలీన ప్రక్రియను తుది దశకు తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత విలీనానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి, డిసెంబరు 9న ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేసింది. ఉద్యోగులు కోరిన డిమాండ్లలో విలీన ప్రక్రియ, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రధానమైనవి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా నియమించింది ప్రభుత్వం. దీంతో ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఎన్నికల ప్రకటనకు ముందే వివిధ కార్మిక సంఘాలు డిపోల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గెలిచే గుర్తింపు సంఘాన్ని విలీన విధివిధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తామని ప్రకటించడంతో, కార్మిక సంఘాలు విజయమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ విలీన ప్రక్రియ త్వరలోనే సాకారం కానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
