ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటామని రెండుసార్లు వాయిదాలు కూడా పెట్టారు. ముచ్చటగా మూడోసారి పక్కాగా..సన్నబియ్య పంపిణీ స్టార్ట్ చేస్తామంటున్నారు. అందుకు ఉగాది పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసింది తెలంగాణ సర్కార్. గత డిసెంబర్‌లోనే సన్నబియ్యం ఇవ్వాలనుకున్నారు. కానీ కొత్త రేషన్ కార్డుల ప్రాసెస్ అప్పటికీ అయిపోలేదు.
ఇప్పుడు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. అందుకే ఉగాది పండగను తెరపైకి తీసుకొచ్చారు. ఉగాది నుంచి కచ్చితంగా సన్నబియ్యం ఇస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. సన్నబియ్యం పంపిణీ రెండుసార్లు వాయిదా పడటానికి..రెండు కారణాలు ఉన్నాయట. కొత్త రేషన్ కార్డుల అంశం ఒక సవాల్ అయితే. మరొకటి బియ్యం సేకరణ. అధికారుల మధ్య సమన్వయం లేక రేషన్‌కార్డుల విషయంలో గందరగోళం నడుస్తోందట. రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి.
ప్రజల నుంచి మరో 40 లక్షల వరకు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కానీ అధికారులు మాత్రం మొదట్లో 6 లక్షల 68 వేల దరఖాస్తుదారులను మాత్రమే అర్హులుగా తేల్చారు. ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు రావడంతో అప్లై చేసుకున్న అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారట. ఎమ్మెల్సీ కోడ్ అయిపోగానే రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్‌కార్డుల కోసం పలు డిజైన్లను కూడా పరిశీలించారు. ఒకట్రెండు రోజుల్లో డిజైన్లను ఫైనల్ చేసి..కార్డులు అందజేయాలని నిర్ణయించారు.
పంపిణీ చేయడానికి సరిపడా బియ్యం ఉందా?
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు 89 లక్షలతో పాటు అదనంగా ఇవ్వనున్న 40 లక్షల కార్డులను కలుపుకుంటే మొత్తం కోటి 30లక్షల రేషన్ కార్డులు అవుతున్నాయి. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం, గురుకులాలు. అంగన్‌వాడీలన్నింటికి కలుపుకొని ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కానున్నాయట. అయితే ఈ సారి ప్రభుత్వం వానాకాలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించింది. ఇప్పటి వరకు పీడీఎస్ కింద మిల్లుల నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను రెడీగా ఉంచినట్లు పౌరసరఫరాలశాఖ చెబుతోంది.
ప్రస్తుతం నిల్వ ఉన్న బియ్యం మూడు నెలలు పంపిణీ చేయడానికి సరిపోతాయని అంచనా వేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియ పూర్తి చేసి..ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి పాత, కొత్త రేషన్‌కార్డులకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందట.
సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ నేపథ్యంలో ఈ సారి ఉగాది హామీని కచ్చితంగా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ప్రభుత్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి.