Representative Image (Image Credit To Original Source)
Telangana BJP: గ్రేటర్ మూడు కార్పొరేషన్లు అయింది. ఆ మూడింటికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా..కాషాయ జెండా ఎగరేయాల్సిందేనని ఫిక్స్ అయిపోయిందట బీజేపీ. మూడు మేయర్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోందట. ఇందుకు అనుగుణంగా సంస్థాగత మార్పులకు సిద్ధం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని కార్పొరేషన్లలో గెలుపే లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది కమలం పార్టీ.
గ్రేటర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం..GHMC విభజన అయిపోయింది. ఇక గ్రేటర్ పరిధిలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన సర్కార్..అడ్మినిస్ట్రేషన్ సమస్యలు, న్యాయ చిక్కులు తొలగిపోయాక ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి తీరాలని కమలదళం గట్టి పట్టుదలతో ఉంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జెండా పాతేయాలనుకుంటున్న కమలనాథులు..సంస్థాగతంగా భారీ మార్పులు చేసేందుకు సిద్ధం అవుతున్నారట. వ్యూహాత్మక మార్పులు చేయడం ద్వారా బీజేపీని మూడు కార్పొరేషన్ల పరిధిలో బలోపేతం చేయలాన్న దిశగా అడుగులు వేస్తున్నారట. ఇది సక్సెస్ అయితే మూడు కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమంటున్నారు బీజేపీ లీడర్లు.
ప్రస్తుతం బీజేపీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను సంస్థాగతపరంగా ఎనిమిది జిల్లాలుగా విభజించింది. సంస్థాగత పరంగా ఆ ఎనిమిది జిల్లాలకు ఎనిమిది మంది అధ్యక్షులను నియమించింది. హైదరాబాద్‌లో మహాంకాళి సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, గోల్కొండ, భాగ్యనగర్‌గా..ఉమ్మడి రంగారెడ్డిలో రంగారెడ్డి రూరల్, రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ రూరల్, మేడ్చల్ అర్బన్‌గా విభజించారు బీజేపీ నేతలు. దీంతో ఏదైనా అంశంపై పోరాటం చేయాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయట.
ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో ఆయా నాయకులు ఏ కలెక్టరేట్‌కు వెళ్లి..ఎక్కడ ఉద్యమం చేయాలన్న దానిపై స్పష్టత రావడం లేదట. దీంతో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు పార్టీ నేతలకు ఇబ్బందులు వస్తున్నాయట. అంతే కాకుండా రంగారెడ్డి రూరల్ జిల్లా శేరిలింగంపల్లి మొదలుకొని ఎల్బీనగర్ వరకు ఉంటుంది. మధ్యలో గోల్కొండ జిల్లా , భాగ్యనగర్ జిల్లా కూడా ఉంటాయి. దీంతో సమావేశాలు ఉన్న సమయంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి నాయకులు ఇబ్బంది పడాల్సి వస్తుందట. వీటన్నింటికీ తెరదించేందుకు బీజేపీ కొత్త ప్లాన్‌ను తెరమీదకు తెస్తుందని అంటున్నారు.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విడగొట్టిందో..అదే విధంగా సంస్థాగత మార్పులు చేయాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు. ఎనిమిది జిల్లాలను సంస్థాగతంగా విలీనం చేసి మూడు కార్పొరేషన్లుగా విభజించాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. జీహెచ్ఎంసీ, మల్కాజ్ గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లకు అధ్యక్షులను పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూడు కార్పొరేషన్లకు ఎనిమిది బీజేపీ ఎంపీల్లో ముగ్గురికి పూర్తిగా ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ మినహా మిగిలిన ఆరుగురు ఎంపీల్లో రఘునందన్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్..GHMC, MMC, CMC కార్పొరేషన్ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదంటున్నారు.
ఇలా అటు అధ్యక్షులు, ఇటు ఇంచార్జ్‌ల నియామకంతో పార్టీని బలోపేతం చేసి..గ్రేటర్‌లో పాగా వేయాలనేది కమలం పార్టీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. ఈ తరహా విభజన చేస్తే ఆయా కార్పొరేషన్ల పరిధిలోని సమస్యలపై ఆ ప్రాంత నాయకులు కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు నేతలు. సంస్థాగత సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా కార్పొరేషన్ అధ్యక్షులు, మిగతా పోస్టులు ఉపయోగపడతాయని చెబుతున్నారు కమలనాథులు. సంస్థగత మార్పులు గ్రేటర్‌లో బీజేపీ బలోపేతానికి ఎంత వరకు ఉపయోగ పడతాయో చూడాలి.
Also Read: ఎవరైతే మాకేంటి? మంత్రులను కూడా డోంట్ కేర్ అంటున్న ఆఫీసర్లు.. కరీంనగర్ జిల్లాలో ఎందుకిలా