×
Ad

Achamepet BRS: ఆ బాధ్యతలు నాకొద్దు..! బీఆర్ఎస్‌లో అచ్చంపేట అలజడి.. ఎందుకు?

వచ్చే ఎన్నికల్లో తిరిగి నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేసి గెలిచేందుకు తాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే..తనకు అచ్చంపేట బాధ్యతలు ఎందుకని సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేశారట.

Achampet BRS: నా నియోజకవర్గాన్ని చక్కదిద్దుకునేందుకే టైమ్‌ సరిపోవడం లేదు. నాకు పక్క నియోజకవర్గం బాధ్యతలు ఎందుకు. ఇదీ ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆవేదన. అవును..నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఇదే మాట అంటున్నారట. అచ్చంపేట ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించడం పట్ల సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. అంతేకాదు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన అచ్చంపేటకు ఇంఛార్జీగా ఉండటం వల్ల తనకు ఒరిగేదేమి లేదని కూడా మర్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కూడా అచ్చంపేట బాధ్యతలు ఎత్తుకోవడానికి సిద్దంగా లేరట. ఇంతకీ బీఆర్ఎస్‌లో అచ్చంపేట అలజడి ఎందుకు?

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పాలిటిక్స్ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. ఈ మధ్యే అచ్చంపేటలో సభ పెట్టిన కేటీఆర్..అక్కడ పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు అనధికారికంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు.

తన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకునేందుకే సమయం సరిపోవడం లేదని ఆవేదన..!

ఆదివారం జరిగిన బీఆర్ఎస్ జనగర్జన సభ ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతలు కూడా మర్రి జనార్ధన్‌ రెడ్డే చూసుకున్నారు. సభ విజయవంతం అయినప్పటికీ..ఇంఛార్జీ బాధ్యతల పట్ల మాత్రం మర్రి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను నాగర్ కర్నూలు నుంచి ఓడిపోయానని, తన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకునేందుకే సమయం సరిపోవడం లేదని..ఇప్పుడు అచ్చంపేట బాధ్యతలు ఇస్తే ఎలా అంటూ మర్రి జనార్ధన్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారట.

వచ్చే ఎన్నికల్లో తిరిగి నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేసి గెలిచేందుకు తాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే..తనకు అచ్చంపేట బాధ్యతలు ఎందుకని సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేశారట. తనకు సంబంధం లేని అచ్చంపేట నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడంతో అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మర్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా అచ్చంపేట ఎస్సీ రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్. అక్కడ తనకు బాధ్యతలు ఇవ్వడంతో..ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అంటున్నారట.

నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి..!

అయితే గువ్వల బాలరాజు జంపింగ్ తర్వాత..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అచ్చంపేట బీఆర్ఎస్ ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అచ్చంపేట బాధ్యతలు తీసుకోవడానికి ఆర్ఎస్పీ కూడా సుముఖంగా లేరట. తాను అసెంబ్లీకి పోటీ చేస్తే ఉత్తర తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తానంటున్నారట. లేకపోతే నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. అంతేకానీ అచ్చంపేట ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోవడం ఆర్ఎస్ ప్రవీణ్‌కు కూడా ఇష్టం లేదట.

అయితే నియోజకవర్గ పునర్విభజన జరిగితే నాగర్‌కర్నూలు, అచ్చంపేట పరిధిలో మూడు సెగ్మెంట్లు వచ్చే అవకాశం ఉందట. ఆ లెక్కల్లో భాగంగానే బలమైన నేతను ఇంచార్జ్‌గా నియమించే వరకు అచ్చంపేట బాధ్యతలు చూసుకోవాలని మర్రికి బాధ్యతలు ఇచ్చారట కేటీఆర్. అటు నాగర్ కర్నూల్..ఇటు అచ్చంపేట రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు తనకు టైమ్‌ ఉండట్లేదని అంటున్నారట మర్రి. ఎలాగోలా బుజ్జగించి ఆర్ఎస్పీకే బాధ్యతలు అప్పజెప్తారో..మరో నేతను ఇంచార్జ్‌గా నియమించేదాకా ఆ భారం మర్రిపైనే వేస్తారో చూడాలి మరి.

Also Read: లోకల్ ఫైట్.. 42శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి? సర్కార్ ముందున్న ఆ 4 ఆప్షన్స్ ఏంటి?