CM Revanth Reddy
Gossip Garage : పవర్‌లోకి వచ్చి ఏడాది గడిచిపోతోంది. వన్ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్‌గా జరిగిపోయాయ్. ఇక మిగిలి ఉంది మిగతా హామీలే. ఆలోచించడానికేం లేదు. పాలనను పరుగులు పెట్టించాల్సిందే. ఆరు గ్యారెంటీల్లో మిగిలిన హామీలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి..సంక్షేమంలో దూసుకెళ్లాల్సిందేనని ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్. ప్రభుత్వ ఆదాయం మీద ఫోకస్ పెట్టారట. సర్కార్ ఖజానా కళకళలాడే మార్గాలేంటో రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారట. ఆదాయం పెంచుకునేందుకు సర్కార్ ఏం చేయబోతోంది.? రెండో ఏడాదిలో ఇక దూకుడేనా.?
ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. చెప్పిన వాటిలో కొన్ని చేశారు. ఇంకా కొన్ని అమలు చేయాల్సి ఉంది. ఇక సెకండ్ ఇయర్‌లో ఆ హామీలన్నీ నెరవేర్చే యోచనలో ఉన్నారట సీఎం రేవంత్. పాలనను పరుగులు పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారట. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం కావాల్సిన నిధులపై ఫోకస్ పెట్టారట. ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
పడిపోయిన ఆదాయం, ఆందోళనలో ప్రభుత్వం..
కొన్నాళ్లుగా ప్రభుత్వ ఆదాయం అంచనాలకు తగ్గట్లుగా రావడం లేదట. పైగా క్రమక్రమంగా ఆదాయం తగ్గిపోతోందని ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని ఆందోళనకు గురి చేస్తోందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో 42వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు పెట్టుకోగా.. 4వేల 719 కోట్ల వరకు ఆదాయం తగ్గిందట. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మద్యంపై అమ్మకపు పన్ను 8వేల 79 కోట్లు వస్తాయని టార్గెట్ పెట్టుకుంటే 31 కోట్లు పెరిగి 8వేల 110 కోట్లు వచ్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్ వరకు జీఎస్టీ లక్ష్యం 24వేల 906 కోట్లు కాగా..ఏకంగా 4వేల 86 కోట్ల ఆదాయం తగ్గిందట. మద్యం అమ్మకాలపై తప్ప జీఎస్టీ, పెట్రోలియంపై అమ్మకపు పన్ను, వృత్తి పన్ను వంటి ఆదాయాలు పడిపోవడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోందట.
నిధుల సేకరణ, ఆదాయ పెంపు మార్గాలపై రేవంత్ సర్కార్ దృష్టి..
ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు ఉన్న నేపథ్యంలో నిధుల సేకరణ, ఆదాయ పెంపు మార్గాలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అదనంగా పన్నులు పెంచకుండా ప్రభుత్వ రాబడిని పెంచుకునేందుకు అవకాశాలను పరిశీలించాలని అన్ని శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్..తాను వచ్చేసరికి ఏయే శాఖల ద్వారా ఎంత వరకు ఆదాయం సమకూర్చుకోవచ్చో, నిధుల సేకరణకు ఉన్న అవకాశాలేంటో ప్రణాళికలు సిద్దం చేసి పెట్టి ఉంచాలని సూచించినట్లు సమాచారం. రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పాలనను పరుగులు పెట్టించి, తన మార్క్‌ను చూపించాలని భావిస్తున్న సీఎం రేవంత్..అందుకు కావాల్సిన నిధులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆదాయ సమీకరణపై అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
Also Read : రేవంత్ రెడ్డి వ్యూహాన్ని బీఆర్ఎస్ ముందే పసిగట్టిందా?