Gossip Garage : ఈ అప్పుల గోల ఏంటి? హామీల ఫైట్‌ ఎప్పటివరకు?

తమ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు నిర్మించామని..కానీ రూ.లక్ష కోట్ల అప్పు తెచ్చిన రేవంత్‌ సర్కారు ఒక్క ఇటుకైనా పేర్చలేదంటోంది బీఆర్ఎస్.

Gossip Garage Telangana Debts (Photo Credit : Google)

Gossip Garage : అప్పుపే చర్చ. ఓల్డ్‌ టాపిక్‌ అయినా..తెలంగాణ పాలిటిక్స్‌లో ఇది ఎప్పుడూ ట్రెండింగే. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్..వచ్చిన ఏడాదిలోనే సర్వం నాశనం చేశారని బీఆర్ఎస్‌..మాటల తూటాలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గత సర్కార్ అప్పులు..కాంగ్రెస్ హామీలు..డైలీ ఎపిసోడ్‌లాగా మారాయి. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని కాంగ్రెస్ అంటుంటే..అప్పుల ముచ్చట కాదు..హామీల మాటేందో చెప్పుమని గులాబీ పార్టీ అటాక్ చేస్తోంది. ఈ అప్పుల గోల ఏంటి? హామీల ఫైట్‌ ఎప్పటివరకు?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డైలాగ్‌ వార్..
పదేళ్లు పాలించారు రాష్ట్రాన్ని ముంచారని కాంగ్రెస్ అంటుంటే..ఏడాది పాలనలో లక్ష కోట్ల అప్పు చేశారని బీఆర్ఎస్..ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తమ నడ్డీ విరిగిపోతోందని కాంగ్రెస్ అంటుంటే..అప్పుల లెక్కలు కాదు..కాంగ్రెస్ హామీల లెక్కలు ఏంటో చెప్పాలంటోంది బీఆర్ఎస్. దీంతో ఎన్నికలకు ముందు జరిగినట్లుగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డైలాగ్‌ వార్ కొనసాగుతోంది.

హామీలను ఎగ్గొట్టేందుకు అప్పుల గోల?
పదేళ్ల కేసీఆర్ పాలనలో అడ్డగోలుగా అప్పులు చేశారని..ఏడున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చారని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్‌ను కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. అప్పుల లెక్కలు కాదు.. హామీల లెక్కలు చెప్పు..అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్ విసురుతున్నారు. వ‌డ్డీల ముచ్చట్లు కాదు.. వాగ్దానాల మాటేమిటో చెప్పు అని నిలదీస్తున్నారు. ఏడాది పాల‌న‌లో రేవంత్ రెడ్డి కొత్తగా ల‌క్ష కోట్ల అప్పులు చేశారని.. మరి కాంగ్రెస్ చేస్తున్నదేంటని ప్రశ్నిస్తోంది అపోజిషన్. ముఖ్యమంత్రి త‌న త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, హామీలను ఎగ్గొట్టేందుకు అప్పులు అంటూ గోల పెడుతున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్.

రూ.7లక్షల కోట్ల అప్పు పచ్చి అబ్ధం..
కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారన్నది పచ్చి అబద్ధమంటోంది బీఆర్ఎస్. తాము తొమ్మిదిన్నరేళ్లలో పెట్టుబడి, సంక్షేమ కార్యక్రమాల కోసం నేరుగా చేసిన అప్పు రూ.4లక్షల 26వేల కోట్లు మాత్రమే అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి నెలా రూ.6,500 కోట్లు వడ్డీలు, అప్పుల కోసం కడుతున్నామంటూ సీఎం చెబుతున్నది కూడా శుద్ధ తప్పు అని, బడ్జెట్‌ పత్రాల ప్రకారం నెలకి రూ.2900 కోట్ల చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారని అంటున్నారు కేటీఆర్‌.

పాలన చేతకాక అప్పుల ప్రస్తావన..
తమ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు నిర్మించామని..కానీ రూ.లక్ష కోట్ల అప్పు తెచ్చిన రేవంత్‌ సర్కారు ఒక్క ఇటుకైనా పేర్చలేదంటోంది బీఆర్ఎస్. మాట్లాడితే అప్పుల భారం ఎక్కువైందని..వడ్డీలు కట్టలేకపోతున్నామని మాట్లాడుతున్న రేవంత్‌కు అధికారంలోకి వచ్చే ముందు ఈ విషయాలు తెలియవా అని క్వశ్చన్ చేస్తోంది బీఆర్ఎస్. ఎన్నికల ప్రచారంలో ఆరు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ప్రచారం చేసింది మీరే కదా గుర్తు చేస్తుంది. వడ్డీలు ఎంత..రాష్ట్ర ఆదాయం ఎంత అని లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చి..ఇప్పుడు సన్నాయి నొక్కలు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాలన చేతకాక అప్పుల ప్రస్తావన తెచ్చి బీఆర్ఎస్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం తప్ప..పనితీరు మెరుగు పర్చుకున్నది మాత్రం లేదంటోంది అపోజిషన్. ఇలా రాష్ట్ర అప్పులపై అటు సీఎం రేవంత్..ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య డైలాగ్‌ వార్ కొనసాగుతోంది.

 

Also Read : ఓవైపు సంబురం.. ఇంకోవైపు సమరం.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది.?