Gossip Garage: సిచ్యువేషన్ కలిసి వస్తే అంతా బానే ఉంటుంది. వన్స్ ఒకసారి తేడా కొట్టిందంటే.. ఇక సీన్ సితారే అవుతుంది. అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారట కాంగ్రెస్ ఎంపీ మల్లురవి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లు రవికి..పార్టీలో కీలకమైన క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పోస్ట్ దక్కడంతో ఫుల్ ఖుష్ అయ్యారు. ఇంకేముంది జోరుగా ర్యాలీ తీశారు.
పీసీసీ చీఫ్ అయిపోయినంత హంగామా చేసేశారు ఆయన అభిమానులు. ఈ విషయం తెలిసి రాష్ట్ర ఇంచార్జ్‌కు కోపం వచ్చి.. ఇంత హంగామా అవసరమా అంటూ సుతిమెత్తగా చీవాట్లు పెట్టారట. ఆ ఇష్యూ అలా ఉండగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అలయ్ భలయ్ చేసుకుంటూ సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. అటు క్రమశిక్షణ కమిటీలో ఇటీవలే చేరిన తన సన్నిహితుడికి పదవి కట్టపెట్టడమూ వివాదాస్పదంగా మారుతోంది.
క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌పైనే క్రమశిక్షణ చర్యలకు డిమాండ్..
తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లురవి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారా.? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం పెద్దఎత్తున చేయడం, ఆ తర్వాత అపోజిషన్ ఎమ్మెల్యేతో దోస్తీతో వరుసగా రెండు ఇష్యూస్‌లో ఇరుక్కుపోయారట. ఓవైపు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నేతలు కోరుతుంటే..బాధ్యతల స్వీకరణ రోజు హంగామా చేయడంపై ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారట.
క్రమశిక్షణ కమిటీ ప్రకటన తర్వాత..ఢిల్లీ నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రాండ్ వెల్‌కమ్ ఏర్పాట్లు చేసుకున్నారట. బాణాసంచా కాలుస్తూ..ఓపెన్ టాప్ జీప్‌లో భారీ ర్యాలీ తీశారు. ఇక గాంధీభవన్‌లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి నేతలందరూ రావాల్సిందే అంటూ హుకుం కూడా జారీ చేశారనే టాక్ గాంధీభవన్ లో నడుస్తోంది. ఇప్పటివరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఏ నేత కూడా ఇంత హంగామా చేయలేదట. క్రమశిక్షణ కమిటీ బాధ్యతల స్వీకరణ సందర్భగానే క్రమశిక్షణ తప్పారని ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదులు అందాయట.
ఇంత హంగామా అవసరమా?
గాంధీభవన్‌లో బాధితుల స్వీకరణ తర్వాత మల్లురవి నేరుగా..ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మీనాక్షి ఆఫీస్‌కు వెళ్లగానే ఆమె క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పోస్ట్ వస్తే ఇంత హంగామా అవసరమా.? ఎందుకు ఇంత హడావిడి చేశారంటూ మల్లురవి తీరుపై సింప్లిసిటీకి పర్యాయపదంగా ఉండే ఇంఛార్జీ మీనాక్షి అసహనం వ్యక్తం చేశారట.
Also Read: రాజాసింగ్ దారెటు? ధిక్కారం వెనుక మతలబేంటి?
మల్లు రవికి మీనాక్షి క్లాస్..!
క్రమశిక్షణ కమిటీ బాధ్యతల స్వీకరణ హడావుడి పక్కన పెడితే.. మరో విషయంలో కూడా ఇంచార్జ్ చేత మల్లురవి మాట పడాల్సి వచ్చిందట. క్రమశిక్షణ కమిటీలో.. పార్టీ నియమావళి తెలిసిన వారిని పెట్టుకోవాల్సింది పోయి..ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి ఎలా తీసుకుంటారు అంటూ నిలదీశారట. కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవలే వచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంకు చెందిన నిరంజన్ రెడ్డి అనే వ్యక్తిని క్రమశిక్షణ కమిటీలోకి తీసుకున్నారట. ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు పార్టీ నియమ నిబంధనలు ఎలా తెలుస్తాయంటూ క్లాస్ తీసుకున్నారట. ఇలా చార్జ్ తీసుకున్న రోజే రెండు అంశాలపై ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మాట అనిపించుకోవడంతో మల్లురవి కాస్త నిరాశకు గురయ్యారట.
ఇదంతా ఒక ఎత్తయితే..మరొక వివాదంలో చిక్కుకున్నారు మల్లురవి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..గద్వాల జిల్లాలో జరిగిన వేడుకల్లో ఎంపీ మల్లురవి పాల్గొన్నారు. వేడుకల తర్వాత అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడును తన వాహనంలో ఎక్కించుకొని..పార్టీ నేత సరితా తిరుపతయ్య ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేకు సన్మానం చేసి ఫోటోకు లుక్ ఇచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేతో దోస్తీ చేయడంతో..మల్లురవిని టార్గెట్ చేశారు ఆయన సొంత ఎంపీ నియోజకవర్గానికి అలంపూర్ కాంగ్రెస్ నేతలు.
క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉంటూ.. ప్రతిపక్ష పార్టీ నేతలతో చెట్టా పట్టాలేసుకొని తిరగడం ఏంటంటూ నిలదీశారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా మల్లురవిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారట. దీంతో వివరణ ఇస్తూ మల్లురవి ఓ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే విజేయుడు విషయంలో కాకతీయంగా జరిగింది తప్ప..తాను కావాల్సి చేసింది లేదంటూ చెప్పుకొచ్చారు.
అయితే జిల్లాలో తనకు పోటీగా ఉన్న సంపత్ కు చెక్ పెట్టేందుకు విజయుడిని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు స్థానిక ఎంపీగా ఉన్న మల్లు రవి ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంపత్ వర్గీయులు మండిపడుతున్నారు. ఇలా క్రమశిక్షణ కమిటీ ఛైర్మనే గీతదాటారంటూ ఆయనకు వరుసగా ఝలక్‌కులు ఎదురయ్యాయి. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా మునుముందు ఆయన ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో చూడాలంటూ చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ లీడర్లు.