Jeevan Reddy: కారెక్కుతారా? కమలం గూటికి చేరతారా? కాంగ్రెస్‌ను వీడితే జీవన్‌రెడ్డి దారెటు?
భవిష్యత్ రాజకీయ పరిణామాలు..పొడిచే పొత్తులు తన పొలిటికల్ కెరీర్‌కు నష్టం చేయకుండా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారట.
- Naveen
- Published On : March 19, 2026 / 09:23 PM IST
- హస్తంకు హ్యాండ్ ఇచ్చి ఏ పార్టీలో చేరబోతున్నారు?
- పార్టీ మారొద్దంటూ జీవన్‌రెడ్డికి బుజ్జగింపులు
- షరతులు వరిస్తాయి అంటున్న జీవన్ రెడ్డి?
- జీవన్‌రెడ్డి బీజేపీలో చేరేలా ఎంపీ అరవింద్ ప్రయత్నాలు
Jeevan Reddy: కాంగ్రెస్‌లో ఉండలేరు. ఇది కన్ఫామ్. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలని కూడా డిసైడ్ అయ్యారు. బట్ రాజీనామా ప్రకటన ఒక్కటే లేటు అన్నట్లుగా సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు మాజీమంత్రి జీవన్‌రెడ్డి. అయితే కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పి కారెక్కుతారా? లేక కమలం గూటికి చేరుతారా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ఆ రెండు పార్టీలు జీవన్‌రెడ్డికి కండువా కప్పేందుకు రెడీగా ఉన్నాయట. జగిత్యాల పొలిటికల్ జంక్షన్‌లో నిలబడిన జీవన్ రెడ్డి దారెటు?
నాలుగు దశాబ్దాలకుపైగా హస్తం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంపుకునేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి. కొన్నాళ్లుగా అధికార పార్టీలో అసంతృప్తి రాగం వినిపిస్తూ వస్తున్న ఆయన తీరు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో చర్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసంతృప్తి ఎక్కువైంది. ఇతర పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఎమ్మెల్సీ పదవీకాలం ఉన్నప్పటికీ కూడా తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదనేది జీవన్ రెడ్డి ప్రశ్న. సేమ్‌టైమ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంజయ్‌ను చేర్చుకోవడం..తన ప్రత్యర్థి అయిన సంజయ్‌కి ప్రయారిటీ ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇక విలువ లేని చోట ఉండటం ఎందుకంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారట జీవన్‌రెడ్డి.
జీవన్ రెడ్డి కారెక్కడం ఖాయం అనుకునేలోపే మరో ఆఫర్?
జీవన్ రెడ్డి పార్టీ మారడం పక్కా అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 24 లేదా 25 తేదీల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారంటూ జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. అయితే హస్తం పార్టీని వీడననున్న జీవన్‌రెడ్డి..బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమని..కేసీఆర్, కేటీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరితే జగిత్యాలలోనే కాదు..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదనే అభిప్రాయాలు ఉన్నాయి. సేమ్‌టైమ్ బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రూపంలో దొరికినట్లవుతుంది. పార్టీలో కూడా సముచిత స్థానం ఇస్తామంటూ బీఆర్ఎస్ అఫర్ చేస్తుందట. ఓవైపు జీవన్ రెడ్డి కారెక్కడం ఖాయం అనుకునేలోపే మరో ఆఫర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.
జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారని..ఆయన అనుచరులు కూడా కారెక్కాలని సూచిస్తున్నారని అంటున్నారు. జగిత్యాలలో సభ పెట్టి గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆయనకు బీజేపీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ ధర్మపురి అరవింద్‌కు…జీవన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయనేది ఓపెన్ సీక్రెట్. జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందని..అంత సీనియర్ లీడర్‌ను అలా అవమానించడం సరికాదంటూ..మున్సిపల్ ఎన్నికల సమయంలో అరవింద్ రియాక్ట్ అయ్యారు కూడా.
బీజేపీలో చేరితే ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందనే ఆందోళన?
ఈ క్రమంలోనే ఎలాగైనా జీవన్‌రెడ్డిను పార్టీలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట అరవింద్. జీవన్‌రెడ్డి చేరిక కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు కూడా జరుపుతున్నారట. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్ వస్తే పార్టీ బలం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయనేది అరవింద్ వాదనగా చెబుతున్నారు. అయితే హిందుత్వ పార్టీగా పేరున్న బీజేపీలో చేరితే..ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందని ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నారట.
గులాబీ పార్టీ ఆకర్షిస్తోంది. కమలం పిలుస్తోంది. మరి జీవన్‌రెడ్డి కారెక్కుతారా? కమలంతో దోస్తీ కడతారా? అనే చర్చ జరుగుతున్న టైమ్‌లో పార్టీ మారొద్దంటూ కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. జీవన్‌రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్‌కు నష్టమంటూ ముఖ్యనేతలు అధిష్టానానికి వివరించారట. దీంతో మీనాక్షి నటరాజన్..జీవన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసినా ససేమీరా అన్నారట. కాంగ్రెస్‌ను వీడాక..ఏ పార్టీలో అడుగుపెడితే…పొలిటికల్ ఫ్యూచర్ బాగుంటుందనేది ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారట జీవన్‌రెడ్డి. భవిష్యత్ రాజకీయ పరిణామాలు..పొడిచే పొత్తులు తన పొలిటికల్ కెరీర్‌కు నష్టం చేయకుండా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారట. అయితే సొంత పార్టీపై గుస్సాగా ఉన్న జీవన్ రెడ్డి..బుజ్జగింపులకు కాంగ్రెస్‌లోనే సర్ధుకుపోతారా? లేక బీఆర్ఎస్, బీజేపీలో ఏ పార్టీలోకి వెళ్తారనేది మరో నాలుగైదు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
