Telangana Congress: గ్రేటర్‌లోని మూడు మేయర్ పీఠాలపై కాంగ్రెస్ ఫోకస్.. పట్టు కోసం కొత్త స్కెచ్?
ఎంపీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా గ్రేటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ చేతులెత్తేసింది.
- Naveen
- Published On : March 12, 2026 / 09:41 PM IST
Cm Revanth Representative Image (Image Credit To Original Source)
- ఎంపీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కి నెగెటివ్ ఫలితాలు
- మున్సిపల్ ఎన్నికల్లోనూ గ్రేటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో చేతులెత్తేసిన కాంగ్రెస్
- బలమైన లీడర్లు లేరనే టెన్షన్
Telangana Congress: విలీనం, విభజన అయిపోయింది. గ్రేటర్ పరిధిలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. లీగల్ సమస్యలు సాల్వ్ అయితే ఎన్నికలు నిర్వహించడమే లేటు అన్నట్లుగా చెబుతోంది అధికార పార్టీ. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా..ఆ మూడు మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని కసి మీదుంది కాంగ్రెస్. కానీ గ్రేటర్‌లో హస్తం పార్టీకి బలమైన అభ్యర్థులు కరువయ్యారన్న టాక్ వినిపిస్తోంది. మూడు మేయర్ పీఠాల కోసం కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు ఏంటి? గెలిచే పరిస్థితులు లేవు కాబట్టే ఎన్నికల ఊసు ఎత్తడం లేదా? కాంగ్రెస్ పార్టీ వేస్తున్న నయా ప్లాన్స్ వర్కౌట్ అయ్యేనా?
రాష్ట్రంలో ఎలాగూ అధికారంలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. తెలంగాణకు గుండె లాంటి గ్రేటర్ హైదరాబాద్ లో పాగా వేస్తే..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ గెలవొచ్చని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసింది. వార్డుల పునర్విభజన కూడా పూర్తి చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. లీగల్ సమస్యలు, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్‌తో ఎన్నికలు పెట్టలేకపోతున్నట్లు లీకులు ఇస్తున్నారు.
గ్రేటర్ లో కాంగ్రెస్ కి సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవా?
కానీ అసలు కారణం వేరే ఉందంటున్నారు. గ్రేటర్‌లో పాగా వేసేందుకు హస్తం పార్టీకి సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవని సర్వేల్లో తేలిందట. ఓవైపు బలమైన అభ్యర్థులు లేకపోగా..మరోవైపు పబ్లిక్ పల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమంత పాజిటివ్‌గా లేవన్నట్లు చెప్పారట సెఫాలజిస్టులు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌లో పట్టు కోసం ఆపసోపాలు పడుతోందట అధికార పార్టీ. ఏం చేసైనా మూడు కార్పొరేషన్లలో పాగా వేసి తీరాలని నయా వ్యూహాలు రచిస్తోందట.
గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నా..పరిస్థితులను చూసి ముందు వెనుక ఆలోచిస్తున్నారట. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరే ఉన్నారు. వాళ్లు కూడా ఉప ఎన్నికల్లో గెలిచిన వాళ్లే. అంతేకాదు చెప్పుకోదగ్గ లీడర్స్, క్యాడర్ లేదు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి 300 వార్డులకు.. 300 మంది బలమైన లీడర్లు కూడా దొరకడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో చరిష్మా ఉన్న నాయకులు కూడా లేకపోవడం హస్తం పార్టీని కలవరపెడుతోందట. అందుకే ముందుగా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు.
ఎంపీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా గ్రేటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ చేతులెత్తేసింది. అధికార పార్టీగా మారిన తర్వాత కిందామీద పడి గెలుచుకున్న జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌లో మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్‌కు చెందిన వాళ్లే. ఇందులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్..కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ లోని మూడు మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడం కాంగ్రెస్‌కు సవాల్‌గా మారుతోందనే టాక్ నడుస్తోంది.
ఇతర పార్టీల్లో ఉన్న బలమైన లీడర్లను ఆకర్షించే ప్రయత్నం..
అందుకే ముందుగా పార్టీని బలోపేతం చేసేందుకు చేరికలను ప్రోత్సహించాలని, ఇతర పార్టీల్లో ఉన్న బలమైన లీడర్లను హస్తం పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసి ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న బలమైన లీడర్లను సొంత గూటికి రప్పించే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకే గ్రేటర్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట.
గ్రేటర్ పరిధిలోని 300 డివిజన్లలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేషన్ ఛైర్మన్లను ఎన్నికల బరిలో దించాలని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నారట. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయించే ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఎమ్మెల్యే స్థాయి నేతలు కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోతే వారి కుటుంబ సభ్యులను బరిలో పెట్టి గెలిపించాలని టార్గెట్ పెట్టనున్నారట.
బలమైన అభ్యర్థులను పోటీలో పెడితే తప్ప గెలిచే అవకాశాలు లేవని..గ్రేటర్ ఎన్నికలే రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయనే భావనతో ప్రెస్టీజియస్‌గా తీసుకుంటోందట అధికార కాంగ్రెస్. గ్రేటర్‌లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని..పోటీ చేయాలనుకునే ఆశావహులు యాక్టీవ్ కావాలని హస్తం పార్టీ పెద్దలు ఇండికేషన్ ఇచ్చినట్లు టాక్. అపోజిషన్‌లో ఉన్నప్పుడు GHMC ఎన్నికల్లో కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు మూడు మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. అధికార పార్టీ ప్లాన్ లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read: మానవత్వంతో కూడిన వైద్య సాయం అందించాలి, విద్యా విధానంలో మార్పులు తెస్తాం- సీఎం రేవంత్
