Gandhi Bhavan Representative Image (Image Credit To Original Source)
Telangana Congress: మీరు పవర్ ఫుల్. జిల్లాకు బాస్‌లు కూడా మీరే. ఎమ్మెల్యే టికెట్లను డిసైడ్ చేసేది మీరే. డీసీసీ అధ్యక్షులే పీసీసీ చీఫ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన హైప్ డీసీసీలను ఫుల్ ఖుష్ చేసిందట. ఇంకేముంది ఇదే మంచి టైమ్ అని మనసులో మాటను రాహుల్ ముందు చెప్పేశారట డీసీసీ ప్రెసిడెంట్‌లు. పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరు ఇబ్బందికరంగా ఉందని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారట. సదరు అమాత్యులు, ఎమ్మెల్యేల తీరుపై పార్టీ గుర్రుగా ఉందట. ఇంతకు డీసీసీలను ఇబ్బంది పెడుతున్న ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు? డీసీసీ ప్రెసిడెంట్‌లు ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంలో మతలబేంటి?
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల సందర్భంగా చోటు చేసుకున్న ఒక వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శిక్షణ ముగింపు కార్యక్రమం రోజు ఏకంగా 8 మంది మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై డీసీసీ ప్రెసిడెంట్‌లు రాహుల్ గాంధీ ముందు గొంతెత్తడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ అగ్రనాయకత్వం సీరియస్‌గా తీసుకుందట. సమస్యను సాల్వ్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారట. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది ఒకవైపు గోప్యంగా ఉంచుతూ..ఈ ఇష్యూను సైలెంట్‌గా సెటిల్ చేయాలని పీసీసీ చీఫ్ ప్రయత్నం చేస్తున్నారట. డీసీసీలు రాసిన ఫిర్యాదు లేఖలు కూడా బయటకు రాకుండా మ్యానేజ్ చేశారట పీసీసీ చీఫ్.
ప్రస్తుతం ఉన్న డీసీసీల నియామకం మూడు నెలలు క్రితం జరిగింది. ఉన్న డీసీసీలలో ఎక్కువ మంది కొత్త వారే. దీంతో పలువురు ఎమ్మెల్యేలు డీసీసీ ప్రెసిడెంట్లను లైట్ తీసుకుంటున్నారట. మరోవైపు డీసీసీలను ఫుల్ పవర్ ఫుల్ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారట. తాము అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే..డీసీసీల పెత్తనం ఏంటనే ధోరణిలో ఉన్నారట పలువురు ఎమ్మెల్యే, మంత్రులు.
ఈ మధ్య మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ బీ-ఫామ్‌ల విషయంలో కొన్నిచోట్ల పెద్ద వివాదమే చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుల ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్‌లే టికెట్లు పంచేశారట. డీసీసీల ప్రెసిడెంట్లతో తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారట. ఇదంతా అవమానకరంగా భావించిన డీసీసీలు..ఇదే విషయాన్ని శిక్షణా తరగతుల సందర్భంగా రాహుల్ ముందు గొంతెత్తారట. పార్టీ అధిష్టానం ఒకవైపు డీసీసీలు ఫుల్ పవర్ ఫుల్ అని చెబుతుంటే..క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి పూర్తి డమ్మీగా మారిందని వాపోయారట. తమ సమస్యలను గొంతెత్తేందుకు కోఆర్డినేషన్ ఫోరం ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో తమకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను స్వయంగా రాహుల్ గాంధీ ముందే గొంతెత్తారట.
డీసీసీల ఫిర్యాదుపై రాహుల్ కూడా స్పందించి..సమస్యను పరిష్కరించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను ఆదేశించారట. పార్టీ ఫస్ట్..ఆ తర్వాతే ఎవరైనా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఆదేశించారట. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఫిర్యాదు చేసిన డీసీసీల పేర్లు గోప్యంగా ఉంచుతున్నా గాంధీ భవన్ సర్కిల్స్‌లో కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి వరంగల్ ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ మధ్య పొసగడం లేదట. ఇక్కడ డీసీసీకి మంత్రికి ఉప్పు-నిప్పులా పరిస్థితి ఉందట.
నారాయణపేట్ డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి పడటం లేదట. డీసీసీని మంత్రి వాకిటి పరిగణలోకి తీసుకోవడం లేదట. ఇక నల్లగొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంత్రులే ఈ విధంగా ఉండటంతో..ఎమ్మెల్యేలు కూడా డీసీసీలను చాలా చీప్‌గా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. దీంతో అందరూ ఒక ప్లాట్ ఫామ్‌గా డీసీసీల కో-ఆర్డినేషన్ ఫోరం ఏర్పాటు చేసుకొని..తమ హక్కుల కోసమంటూ గళం ఎత్తుతున్నారు.
ఈ వ్యవహారం చినికి, చినికి గాలి వానలా మారే ప్రమాదం ఉండటంతో.. దీన్ని మొదట్లోనే సెట్ చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే డీసీసీ అధ్యక్షులు, మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య ఉన్న అభిప్రాయభేదాలకు చెక్ పెట్టేందుకు పీసీసీ చీఫ్ డిస్కషన్స్ స్టార్ట చేశారట. సాధ్యమైనంత త్వరలో ఫిర్యాదులు వచ్చిన ఎనిమిది మందిని, ఫిర్యాదు చేసిన డీసీసీలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి..వివాదానికి ఎండ్ కార్డ్ వేయాలని చూస్తున్నారట. పీసీసీ చీఫ్ చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read: రాజ్యసభ బరిలో కారు పార్టీ? అసలు బీఆర్ఎస్ స్కెచ్ ఏంటి.. ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి