బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు..! కారణం అదేనా..

ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు.

Gossip Garage : బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. పార్టీ అధ్యక్షుడు ఏది చెబితే అదే ఫైనల్. పార్టీ తరఫున ఎవరు ఏం మాట్లాడాలన్నా ఓ పద్ధతి ఉంటుంది. ముందుగా అనుకున్న విధంగానే ఎవరైనా మాట్లాడాలి.. కానీ, ప్రస్తుతం పార్టీలో ఆ పరిస్థితులు మారాయంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కమలం నేతల వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లు నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటం వల్ల కమలంలో కలహాలు తీవ్రమవుతున్నాయని టాక్‌ వినిపిస్తోంది.

నేతల మధ్య తీవ్రమవుతున్న బేదాభిప్రాయాలు..!
తెలంగాణ బీజేపీలో నేతల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమవుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాతే తెలంగాణలో ఆ పార్టీ బలోపేతమవుతూ వచ్చింది. 2019లో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీలు గెలవడంతో కమలం పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండగా చేసిన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పార్టీలో చేరికలు మరింతగా పెరిగాయని చెబుతారు. ఇలా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చాక గతం ఒక తీపి జ్ఞాపకంగానే మిగిలిపోతుందనే టాక్‌ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో ప్రారంభమైన విభేదాలు… ఇప్పటికీ సమసిపోలేదని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి.

నిత్యం అసంతృప్తితో రగిలిపోతున్నారు..
ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల్లో కొందరు తమకు సరైన గౌరవం దక్కడం లేదని నిత్యం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి తగిన ప్రొటోకాల్ ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

తనను చిన్నచూపు చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి భావన..
ఇటీవల వరద ప్రాంతాల బాధితులను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు రెండు బృందాలను నియమించారు. ఇందులో ఒక బృందం కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మంలో పర్యటించగా, మరొకటి ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాబాద్‌ వెళ్లింది. అయితే ఈటెల బృందంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని సభ్యుడిగా పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారట. ఒక బృందాన్ని నియమిస్తే బీజేపీ ఎల్పీ నేతగా తాను నేతృత్వం వహించాలని లేదంటే తనను పూర్తిగా మినహాయించాలి కానీ సాధారణ బృంద సభ్యుడిగా ఎలా నియమిస్తారని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మహేశ్వర్‌రెడ్డి. తనను చిన్నచూపు చూస్తున్నారని భావించిన బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటనకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఎల్పీ లీడర్‌ను ఆహ్వానించకపోవడమేంటని ఆగ్రహం..
ఇదిలా కొనసాగుతుండగానే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఓ ప్రైవేటు హోటల్ లో అట్టహాసంగా చేపట్టారు కమలనాథులు. ఈ కార్యక్రమానికి కనీసం బీజేఎల్పీ నేతను ఆహ్వానించలేదన్న వార్త గుప్పు మంటోంది. మీడియాకు పంపించిన ఇన్విటేషన్ లో కేంద్ర మంత్రులు, ఎంపీల పేర్లు పెట్టినా బీజేఎల్పీ నేత పేరు పెట్టలేదట. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పిలిచి ఎల్పీ లీడర్‌ను ఆహ్వానించకపోవడమేంటని మహేశ్వర్‌రెడ్డి అనుచరులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు.

ఇదేనా బీజేపీ ఎల్పీ లీడర్‌కు ఇచ్చే మర్యాద? అంటూ ఆగ్రహం..
ఇవి ఈ వారం రోజుల్లో జరిగిన సంఘటనలని.. గతంలో కూడా ఇలాంటి సంఘటలను చాలా ఉన్నాయని అంటున్నారు. ఎల్పీ నేతకి పార్టీ సమావేశాలలో వేదికపైకి ఆహ్వానించడం లేదని, పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గది ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. చివరికి పార్టీ బ్యానర్లలో మహేశ్వర్‌రెడ్డి ఫొటో కూడా వేయడం లేదని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా బీజేపీ ఎల్పీ లీడర్‌కు ఇచ్చే మర్యాద? అంటూ మహేశ్వర్‌రెడ్డి కూడా ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read : అది కాంగ్రెస్ కండువా కాదు దేవుడి కండువా..! పార్టీ మారిన ఆ ఏడుగురు ఎమ్మెల్యేల సరికొత్త వాదన..

బీజేపీలో చేరిన వారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న సీనియర్లు..
అయితే మహేశ్వర్‌రెడ్డి బాధపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సిద్ధాంతాలు, పార్టీ విధానాలు తెలియకుండా బీజేపీలో చేరిన వారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యమైన పదవులు ఇచ్చినా సంతృప్తి చెందడం లేదని, త్యాగాలు చేసి వారికి పదవులు కట్టబెడితే వారిలో సంతృప్తి ఉంటుందని.. పార్టీ లైన్‌ తెలియని వారే ఇలాంటి వాదనలు తెరపైకి తెస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆవేదనను కొట్టిపడేస్తున్నారు బీజేపీ సీనియర్‌ నేతలు. మొత్తానికి ఈ వ్యవహారం పరిశీలిస్తే బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఇప్పటికీ కుదరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు