×
Ad

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్.. అసలు సార్ స్ట్రాటజీ ఏంటి?

కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారించాలని కోరితే..అందుకు సిట్ అంగీకరించకపోవడంపై బీఆర్ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

  • Published On : January 31, 2026 / 09:18 PM IST

Kcr (Representative Image (Image Credit To Original Source))

  • ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్‌ తీరుపై బీఆర్ఎస్ ఫైర్
  • ఫాంహౌస్‌లో విచారణకు సిట్ ఒప్పుకోకపోవడంపై ఆగ్రహం
  • కేసీఆర్‌ను మానసికంగా వేధించే కుట్ర అంటూ అటాక్
  • నందినగర్‌ నివాసంలో సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన గులాబీ పార్టీ

KCR: మాజీ సీఎంగా..అపోజిషన్‌ లీడర్‌గా..బాధ్యాయుతమైన పౌరుడిగా..సిట్‌ విచారణకు సహకరిస్తా. కాకపోతే మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నా.. విచారణ తేదీని మరో రోజు ఫిక్స్ చేయండి. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ ఇచ్చిన మొదటి నోటీస్‌కు కేసీఆర్ రిప్లై ఇది. ఆ వెంటనే కేసీఆర్‌కు మరోసారి నోటీస్‌ ఇచ్చింది సిట్. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది. నందినగర్‌ నివాసంలో నోటీసులు కూడా అంటించింది సిట్. దీంతో సిట్‌ తీరుపై మండిపడుతోంది బీఆర్ఎస్‌.

విచారణకు వస్తామని చెప్పినా..సిట్ విచారణకు సహకరిస్తామని వివరించినా..ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని..కావాలని కేసీఆర్‌ను మానసికంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గులాబీ పార్టీ. కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారించాలని కోరితే..అందుకు సిట్ అంగీకరించకపోవడంపై బీఆర్ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని..ఇలాంటి నోటీసులు కేసీఆర్‌ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవంటూ అధికార పార్టీపై అటాక్ చేస్తోంది కారు పార్టీ.

ఫోన్ ట్యాపింగ్ కేసు అంతకంతకు ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్‌కు సిట్ రెండోసారి నోటీసులు జారీ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మొదట జనవరి 29న కేసీఆర్‌కు నోటీసు జారీ చేసిన సిట్..30న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని కోరింది. అభ్యంతరం లేకపోతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని, లేకపోతే హైదరాబాద్ నగర పరిధిలో కేసీఆర్ సూచించిన ప్రాంతానికి వచ్చి విచారిస్తామని నోటీసుల్లో పేర్కొంది. సిట్ నోటీసులకు సమాధానం ఇచ్చిన కేసీఆర్ తాను మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నందున మరో తేదీన, ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే విచారించాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ ఇచ్చిన రిప్లైపై సిట్ అధికారులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రెండోసారి నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో నోటీసు అంటించిన సిట్ అధికారులు.. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారించలేమని, నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని సిట్‌ స్పష్టం చేసింది. దీంతో సిట్ నోటీసులపై ఏం చేయాలన్న దానిపై లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో కేసీఆర్ సమాలోచనలు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా చర్చించారు. నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.

కేసీఆర్ ను వేధించే కుట్ర..!

అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును కక్ష సాధింపు చర్యగా చెబుతూ వస్తోంది బీఆర్ఎస్. తమను వేధించే కుట్రలో భాగంగానే నోటీసులు, లీకులు అంటూ అడ్డగోలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు గులాబీ లీడర్లు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులు, సిట్‌ వ్యవహరిస్తున్న తీరును ఎక్స్‌పోజ్‌ చేస్తోంది కారు పార్టీ. సిట్ విచారణకు పిలవగానే హరీశ్‌రావు, కేటీఆర్, సంతోస్ రావులు వెళ్లారని, ఇప్పుడు కేసీఆర్ కూడా సిట్ విచారణకు హాజరవుతారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.

కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా..

అయితే తెలంగాణ సాధించిన నేతగా, పదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కేసీఆర్‌పై రేవంత్‌ ప్రభుత్వం మానసిక వేధింపులకు దిగుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. కనీసం కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా..వరుస పెట్టి సిట్‌ నోటీసులు ఇచ్చి..ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారించాలని కోరితే..అంగీకరించకపోవడం కూడా ప్రభుత్వ ఒత్తిళ్లలో భాగమే అంటున్నారు కారు పార్టీ లీడర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ ముఖ్య నేతలను వేధిస్తోందన్న అంశాన్ని..జనంలోకి తీసుకెళ్లాలని అధిష్టానం భావిస్తోంది. ఇదే సమయంలో సిట్ విచారణ, అధికారుల వైఖరిపై కోర్టుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారట. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తూనే..చట్టాన్ని గౌరవిస్తూ సిట్ విచారణకు హాజరవుతున్నట్లు ప్రజల్లోకి సంకేతాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ.

Also Read: చలాన్ పడితే అకౌంట్లో డబ్బులు కట్.. ప్రాసెస్ స్టార్ట్ అయిందా? మీరూ దీన్ని గమనించారా?