Telangana Congress: డీసీసీల నియామకం అయిపోయింది. పార్టీ పదవులు ఒక్కొక్కటిగా భర్తీ అయిపోతున్నాయ్. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు మాత్రమే మిగిలాయి. హెవీ కాంపిటీషన్ ఉండటంతో..వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని ఇన్నాళ్లు హోల్డ్ లో పెట్టారు. ఆల్ ఆఫ్ సడెన్ గా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హింట్ తో రేసు మొదలైందట. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం లాబీయింగ్ స్టార్ట్ చేశారట లీడర్లు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నదెవరు? ఛాన్స్ దక్కె నేతలెవరు?
కీలకమైన పదవుల కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ..
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి పదవుల పందేరం మొదలైంది. వరుసగా ఒక్కొక్కటిగా పార్టీ పదవులను భర్తీ చేస్తూ వస్తోంది ఏఐసీసీ. ఈ మధ్య కాలంలో వైస్ ప్రెసిడెంట్లు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, జనరల్ సెక్రటరీలు..లేటెస్ట్ గా డీసీసీ డీసీసీ ప్రెసిడెంట్లను నియమించారు. ఇక ఫైనల్ గా మిగిలింది ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు మాత్రమే. ఈ కీలకమైన పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉంది. కీలకమైన నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇన్నాళ్లు హోల్డ్ లో పెట్టారు. అయితే గాంధీభవన్ లో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం నేతలు మరోసారి లాబీయింగ్ స్టార్ట్ చేశారట.
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు అత్యంత కీలకమైనది. ఈ పోస్టులో గతంలో పని చేసిన వారందరూ ఇప్పుడు కీలకమైన పోస్టులో ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన వారే. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా లాస్ట్ టర్మ్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైన నేతలే పని చేయడంతో ఇప్పుడు ఈ పోస్ట్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ సారి వర్కింగ్ ప్రెసిడెంట్లను సామాజిక వర్గాల వారీగా కీలకమైన వ్యక్తులకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీ ఆలోచన చేస్తోంది.
వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం సామాజికవర్గాల వారీగా ఈసారి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచన చేస్తోందట. ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కరికి ఛాన్స్ ఉండటంతో..పోటీలో మాత్రం చాలా మంది క్యూలో ఉన్నారట. రెడ్డి సామాజికవర్గం నుంచి పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డితో పాటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారట.
నాయిని రాజేందర్ రెడ్డికి వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చినా..ఆయన ఆ పోస్టును తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఇక ఎంపీ చామల అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఫైనల్ గా రోహిన్ రెడ్డికి అవకాశం ఇస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక బీసీ సామాజికవర్గం నుంచి టీఎస్ఎండీసీ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారట.
ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లాబీయింగ్ చేస్తున్నారట. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ రేసులో ఉన్నారని అంటున్నారు. ఎంపీ బలరాం నాయక్ పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేసినా..వర్క్ ఔట్ కాలేదని..దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇక ఫైనల్ గా మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఖమ్మం మాజీ డీసీసీ అధ్యక్షుడు జావిద్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కీలకమైన పోస్టు ఎవరెవరికి దక్కుతుందనేది చూడాలి.
Also Read: క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఓవర్‌లిమిట్ ఫీజు రద్దు.. ఇక కంట్రోల్ కస్టమర్ల చేతుల్లోనే..!