Representative Image (Image Credit To Original Source)
Telangana IAS Transfers: ఈ మధ్యే తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు జరిగాయ్. ఐతే వీటిలో అంతా అయోమయం, గందరగోళం. కావాలనుకున్నది దక్కకపోవడంతో కొందరు…. ఇవ్వాలనుకున్న వారికి ఇవ్వకపోవంతో మరికొందరు.. తాము కోరినా పట్టించుకోలేదని ఇంకొందరు.. అటు ఐఏఎస్‌లు, ఇటు అమాత్యులు.. అందరిలోనూ అసంతృప్తే ! పోస్టింగ్‌లు, ప్రాధాన్యాలు, ప్రెస్టీజ్.. అన్నీ కలిసి ఐఏఎస్ బదిలీల విషయంలో సచివాలయం సాక్షిగా భారీ చర్చ మొదలైంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది.
తెలంగాణలో రేవంత్ సర్కార్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాబోయే మూడేళ్లలో పరిపాలనను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా.. భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏకంగా 45మంది ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది. గతంలోనూ బదిలీలు జరిగినా.. ఈ స్థాయిలో కనిపించడం ఇదే మొదటిసారి. బదిలీల్లో తనదైన మార్క్ చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐతే ఈ ట్రాన్స్‌ఫర్ల వ్యవహారమే.. ఇప్పుడు సచివాలయంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది.. ఎవరిని ఎక్కడికి పంపిస్తారు.. సీనియర్లకు ప్రాధాన్యం దక్కిందా.. జూనియర్లకు బెటర్ ప్లేస్ వరించిందా… మాములుగా ఐఏఎస్‌ల బదిలీలు అంటే జరిగే చర్చ ఇది. ఐతే ఈసారి ట్రాన్స్‌ఫర్స్‌లో.. సీనియర్, జూనియర్‌లకు ఊహించని పోస్టింగ్‌లు వచ్చాయనే చర్చ నడుస్తోంది. కావాలనుకున్న కీలక శాఖ రాకపోవడంతో కొందరు అసంతృప్తిగా ఉంటే…. చివరి నిమిషంలో పదవులు మారిపోవడంతో మరికొందరు షాక్‌లో ఉన్నారట.
ఇంకొందరు అధికారులది ఇంకో తీరు. తమకు రెండు బాధ్యతలు అప్పగించడంపై లోలోపలే చర్చించుకుంటున్నారట. ఇక అటు చాలా జిల్లాలకు కొత్త కలెక్టర్లును పంపించింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల విభాగంలో సంజయ్ కుమార్ ఐటీ శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ అయ్యారు. దీంతో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టాలి. ఆ తర్వాత శ్రీధర్ నుంచి ఆ బాధ్యతలు సీఎస్‌కు వెళ్లాయ్. ఇలా సంజయ్ కుమార్ స్థానంలో శ్రీధర్‌కు బాధ్యతలు ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ మార్చడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇలా బదిలీల్లో చాలా గందరగోళం కనిపిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఊహించని పోస్టులు దక్కి కొందరు.. అనుకూలమైన పోస్ట్ వస్తుందని ఆశపడి భంగపడిన వారు మరికొందరు అధికారులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు.
బదిలీల వ్యవహారం.. ఐఏఎస్‌లనే కాదు అమాత్యులను కూడా అసంతృప్తికి గురి చేసిందని టాక్. కొంతమంది మంత్రులు తమ శాఖలకు కావాల్సిన అధికారులను కోరినా.. బదిలీల్లో వారిని పొందలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ మంత్రులకు కూడా ఇలాంటి చేదు అనుభవమే మిగిలిందని టాక్. TSSPDCL ఎండీగా ఉన్న ముషారఫ్ అలీని మార్చొద్దని.. సదరు శాఖ మంత్రి సూచించినా.. లైట్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ట్రాన్స్‌ఫర్లలో సీనియారిటీ, మెరిట్ పరిగణనలోకి తీసుకోలేదని కొందరు సీనియర్లలో చర్చ జరుగుతోందట. అసంతృప్తిగా ఉన్న ఐఏఎస్‌లంతా.. సీఎస్‌ను కలిసి తమ పోస్టింగ్‌లు మార్చాలని విన్నపాలు చేసుకునేందుకు క్యూ కడుతున్నారనే టాక్ సెక్రటేరియట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అటు కొంతమంది మంత్రులు కూడా.. ఐఏఎస్ బదిలీల్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాబోయే మూడేళ్లను టార్గెట్‌గా పెట్టుకొనే.. బదిలీల విషయంలో సీఎం రేవంత్ నిర్ణయాలు కనిపిస్తున్నాయ్. అడ్మినిస్ట్రేటివ్ గేమ్‌లో తనదైన మార్క్ చూపేలా.. యువతకు, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ.. బదిలీలను పూర్తి చేశారు. మరి ఈ ట్రాన్స్‌ఫర్ల విషయంలో అటు మంత్రులు, ఇటు ఐఏఎస్‌లకు ఉన్న కన్ఫ్యూజన్‌కు రేవంత్ ఎలా బ్రేక్ వేస్తారో చూడాలి.
Also Read: ఒకే ఒక్క చాన్స్.. ఇదే లాస్ట్.. మళ్లీ ఏ పదవి అడగబోను అంటున్న వీహెచ్..! అధిష్టానం నిర్ణయమేంటి?