రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత? కారణం అదేనా..

నికార్సైన కాంగ్రెస్‌ వాదిగా ముద్రపడిన జీవన్‌రెడ్డి... అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు ఎలాంటి ఎత్తుగడ వేస్తారనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Jeevan Reddy (Photo Credit : Google)

Gossip Garage : తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయ‌న మోస్ట్ సీనియ‌ర్ లీడ‌ర్‌. పార్టీలో అత్యంత ప‌లుకుబ‌డిన క‌లిగిన నేత. MLA, MLCగా పని చేసిన ఆ సీనియర్‌ లీడర్‌ పొలిటికల్‌ జర్నీ ఇప్పుడు అయోమయంలో పడిందా? అన్న అనుమానం మొదలైంది..? పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగా మారాయట..? అందుకే పార్టీ కీల‌క‌ స‌మావేశానికి సైతం ఆయన దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు… ఇంతకీ హస్తానికి దూరంగా దూరంగా ఉంటున్న ఆ నేత ఎవరు? ఆయన ఫ్యూచర్‌ ఎలా ఉండబోతోందో?

ఆ ఇష్యూతో బాగా క‌ల‌త చెందార‌ట..
తెలంగాణ కాంగ్రెస్‌లో మోస్ట్ సీనియ‌ర్ లీడ‌ర్ ఎమ్మెల్సీ టి.జీవ‌న్ రెడ్డి. సుదీర్ఘ కాలం మంత్రి పదవితోపాటు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాలను శాసించిన జీవన్‌రెడ్డి.. పొలిటికల్‌ ఫ్యూచర్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో చాలా కీలకంగా ఉంటూ.. పార్టీ గొంతును గ‌ట్టిగా వినిపించిన జీవన్‌రెడ్డి వాయిస్‌ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి సత్తా చాటిన జీవన్‌రెడ్డికి.. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. పార్టీలో పరిణామాలు మింగుడుపడని విధంగా తయారయ్యారంటున్నారు. దీంతో ప్రస్తుతం సైలెంట్‌ అయిపోయారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా తాజాగా చోటు చేసుకున్న ఓ ఇష్యూతో ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బాగా క‌ల‌త చెందార‌ని వినికిడి. గాంధీభ‌వ‌న్ వేదిక‌గా కొత్త పీసీసీ చీఫ్‌ నిర్వహించిన స‌మీక్షా స‌మావేశాలే ఆయన అసంతృప్తికి కారణమనే టాక్ వినిపిస్తోంది.

ఆహ్వానితుల జాబితాలో పేరు లేకపోవడంతో మనస్థాపం..
పీసీసీ సారథిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు తీసుకున్నాక.. ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా స‌మావేశం నిర్వహించగా, సీనియర్‌ నేత జీవ‌న్ రెడ్డికి అవ‌మానం జ‌రిగినట్లు పార్టీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. స‌మావేశం కోసం సిద్ధం చేసిన ఆహ్వానితుల జాబితాలో జీవ‌న్ రెడ్డి పేరు చేర్చకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ అందరి పేర్లను ముద్రించి.. జీవన్‌రెడ్డిని విస్మరించడంతో ఆయన తీవ్రంగా కలత చెందారని చెబుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ‌య్ కుమార్ పేరు ఉండటం కూడా జీవన్‌రెడ్డిని అసంతృప్తికి గురి చేసిందని చెబుతున్నారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురై.. పీసీసీ చీఫ్‌ సమక్షంలోనే త‌న ఆవేద‌న, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

సీనియర్లను విస్మరిస్తున్నారని నిర్వేదం..
గత రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యమివ్వడాన్ని పెద్దాయ‌న జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ విషయమై తన స‌న్నిహితుల వ‌ద్ద ఆవేద‌న వ్యక్తం చేస్తున్నార‌ని చెబుతున్నారు. పార్టీలో కొత్త సాంప్రదాయం తెస్తున్నారని, సీనియర్లను విస్మరిస్తున్నారని జీవన్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. వలస ఎమ్మెల్యేల విష‌యంలో పార్టీ తీసుకునే నిర్ణయం ప‌ట్ల అసంతృప్తిగా ఉన్నారంటున్నారు.

పార్టీలో చేర్చుకోలేదు అంటూనే స‌మావేశాల‌కు ఆహ్వానించడంపై ఆగ్రహం..
బీఆర్‌ఎస్ నుంచి ఏ ఒక్కరిని చేర్చుకోలేద‌ని బ‌య‌ట‌కు చెబుతూ.. పార్టీ స‌మావేశాల‌కు ఎలా ఆహ్వానిస్తున్నారని ప్రశ్నిస్తున్నారట జీవన్‌రెడ్డి. పార్టీ స‌మావేశాల్లో త‌న పేరు ప్రస్తావించ‌క‌పోవ‌డం కాక‌తాళీయ‌మ‌ని పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్‌, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి స‌ర్దిచెప్పే ప్రయ‌త్నం చేసినా.. జీవ‌న్ రెడ్డి మాత్రం.. వారి వాదనతో ఏకీభవించనట్లు చెబుతున్నారు. కావాలనే తనను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానిస్తున్నారట పెద్దాయన. అందుకే పార్టీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకోవడంతోపాటు.. ఈ మధ్య జరిగిన సీఎల్పీ భేటీకి గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది.

క్యాడ‌ర్‌కు ఎలా న్యాయం చేయాలో అనే మదనం..
మ‌రోవైపు తన సొంత నియోజ‌క‌వ‌ర్గం జగిత్యాలలో కూడా మెల్లిమెల్లిగా ఎమ్మెల్యే సంజ‌య్‌కు ప్రాధాన్యత పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు జీవన్‌రెడ్డి. ఇదే సమయంలో నిన్నమొన్నటి వరకు తన వెంట తిరిగిన వారిని దూరం చేసేలా ఎమ్మెల్యే సంజయ్‌ వ్యవహరిస్తుండటం పెద్దాయనను కలవర పెడుతుందని చెబుతున్నారు. నియోజకవర్గంలోని మార్కెట్ క‌మిటీ చైర్మన్లతో మొద‌లు కొని ఇత‌ర‌త్రా నామినేటెడ్‌ పదవుల భర్తీలో ఎమ్మెల్యే సిఫార్సులకే ప్రాధాన్యమిస్తుండ‌టం జీవన్‌రెడ్డికి ఆగ్రహం తెప్పిస్తుందని చెబుతున్నారు. రోజురోజుకు పార్టీలో అవమానాలు ఎక్కువ అవుతుండటం.. త్వర‌లో స్థానిక సంస్థల ఎన్నిక‌లు వ‌స్తున్న నేపథ్యంలో త‌న‌ను న‌మ్ముకున్న క్యాడ‌ర్‌కు ఎలా న్యాయం చేయాల‌నే అంశమై జీవ‌న్ రెడ్డి మ‌ద‌న ప‌డుతున్నార‌ని చెబుతున్నారు.

Also Read : హైడ్రాపై పోరాటానికి బీజేపీ రెడీ.. హైడ్రా దూకుడును అడ్డుకునేలా వ్యూహం?

ప‌ద‌వీ కాలం ముగిసిన త‌ర్వాత మరింత ఇబ్బందిపడే అవకాశం..
ఇప్పుడు మార్కెట్ క‌మిటీ చైర్మన్ల విష‌యంలో జ‌రుగుతున్నట్లే.. స్థానిక ఎన్నిక‌ల్లో జ‌రిగితే ప‌రిస్థితి తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందని.. అదే సమయంలో వచ్చే మార్చిలో తన ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం ముగిసిన త‌ర్వాత మరింత ఇబ్బందిపడే అవకాశం ఉందన్న ఆలోచనతో భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.

మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన లేని జీవన్‌రెడ్డి.. పార్టీని తన దారికి తెచ్చుకోవడం ఎలా అనే అంశంపై ఫోకస్‌ చేశారంటున్నారు. ఇదే సమయంలో జీవన్‌రెడ్డి పొలిటికల్‌ ఫ్చూచర్‌పై ఆయన వర్గంలోనే కలవరం కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మున్ముందు జీవన్‌రెడ్డి అడుగులు ఆసక్తికరంగా మారాయి. నికార్సైన కాంగ్రెస్‌ వాదిగా ముద్రపడిన జీవన్‌రెడ్డి… అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు ఎలాంటి ఎత్తుగడ వేస్తారనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.