Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ ముఖ్యనేతల తీరుపై రుసరుసలాడుతున్నారు. పార్టీని నమ్ముకుని పని చేస్తే ఇదా మాకు మీరిచ్చే గౌరవం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ పార్టీలలో సామాజిక సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది ఉత్తర తెలంగాణలో రాజకీయంగా చైతన్యం కలిగిన.. వెలమ సామాజిక వర్గానికి ఈసారి ఒక్క డీసీసీ కూడా దక్కకపోవడంపై చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు నాలుగు జిల్లాలకు అంటే..వరంగల్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు ఉండే వారు. కానీ ఈసారి ఒక్క డీసీసీ పీఠం కూడా వెలమ వర్గానికి దక్కకపోవడంతో ఆ సామాజిక వర్గం నేతలు అసంతృప్తితో వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్ డీసీసీల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జనగామ డీసీసీ పోస్ట్‌ను గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జి ఝాన్సీరెడ్డి ఆశించారు. వీరిద్దరికి కాకుండా కొంతకాలంగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న లకావత్ ధన్వంతికి జనగామ డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడంపై కొందరు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ డీసీసీ ఆశించిన వెన్నం శ్రీకాంత్ రెడ్డికి కాకుండా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ భార్య భూక్య ఉమాకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై వెన్నం వర్గం రగిలిపోతోంది.
ఇక ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల డీసీసీ పోస్ట్‌ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ తన వర్గానికి ఇప్పించుకోవాలనుకున్నారు. తన మద్దతు కూడా జువ్వాడి నర్సింగారావుకి ప్రకటించారు. కానీ మాజీమంత్రి జీవన్ రెడ్డి తన సీనియారిటీ అంతా ఉపయోగించి తన అనుచరుడు నందయ్యకు ఇప్పించుకున్నారు. దీంతో అటు సంజయ్..ఇటు జువ్వాడి ఇద్దరూ హర్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ పెద్దల దగ్గర తన ఆవేదన వెళ్లగక్కారట ఎమ్మెల్యే సంజయ్.
ఇక కరీంనగర్ డీసీసీ పదవిని కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ ఆశించారు. అయితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు డీసీసీ పోస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు డీసీసీలుగా అవకాశం ఇవ్వము అని చెప్పి ఇప్పుడెలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారట వెలిచాల. మేడ్చల్ డీసీసీ పదవిలో మరోసారి తననే కొనసాగించాలని హరివర్ధన్‌రెడ్డి కోరారు. కానీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వజ్రేష్ యాదవ్‌కే డీసీసీ పోస్ట్ ఇవ్వడంపై హరివర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక నల్లగొండ డీసీసీ పదవిని గుమ్మల మోహన్ రెడ్డి ఆశించారు. మోహన్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరులలో ఒకరు. అయితే జిల్లాలో మంత్రి చెప్పిన వారికి కాకుండా..పున్నా కైలాష్ నేతకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ ఆశించిన కంది శ్రీనివాస్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
ఇక డీసీసీ దక్కిన వారిలో కూడా కొందరు అసంతృప్తితో ఉన్నారు. యాదవ కురుమ కోటాలో మంత్రి పదవి ఆశించిన బీర్ల అయిలయ్యకు..భువనగిరి డీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టారు. దీంతో తనను జిల్లాకే పరిమితం చేస్తున్నారనే అసహనంతో ఉన్నారట అయిలయ్య. మరో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ కూడా అసంతృప్తితో ఉన్నారట. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంబీసీ ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడినే ఉన్నానని..మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతుంటే మరోసారి పెద్దపల్లి జిల్లాకే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని నిరాశలో ఉన్నారట.
డీసీసీల ఎంపికలో రూల్స్ అన్నీ బ్రేక్..!
అసంతృప్తులు, నిట్టూర్పులు ఇలా ఉంటే..ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ డీసీసీల ఎంపిక కోసం మొదట్లో పెట్టిన రూల్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి. ఒక్క పోస్టుకు ఒక్కరే ఉండాలని చెబితే..5 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు, 12మంది పార్టీ వైస్ ప్రెసిడెంట్లకు డీసీసీలలో చోటు దక్కింది. గతంలో డీసీసీలుగా పని చేసిన వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలనే నిబంధన పెట్టినా..నాగర్ కర్నూల్ డీసీసీగా కొనసాగుతున్న వంశీకృష్ణకే మరోసారి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం డీసీసీలుగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు నో ఛాన్స్ అని చెప్పారు. కానీ సిద్దిపేట జిల్లా డీసీసీ పోస్ట్‌ను..ఇప్పటి వరకు డీసీసీగా ఉన్న నర్సారెడ్డి కూతురు అంక్షారెడ్డికి ఇచ్చారు.
ఇంకా మిరాకిల్ ఏంటంటే..డీసీసీ పోస్టుకు దరఖాస్తు కూడా చేయని శివసేనారెడ్డికి వనపర్తి జిల్లా పగ్గాలు కట్టబెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా ఎంపిక చేసేట్లు అయితే..ఏఐసీసీ పరిశీలకుల పర్యటనల పేరుతో హంగామా ఎందుకు చేశారంటూ ప్రశ్నిస్తున్నారు లీడర్లు. మొత్తం మీద డీసీసీల ఎంపిక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందట. పంచాయితీ ఎన్నికల ముందు నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇష్యూను హస్తం పార్టీ పెద్దలు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.
Also Read: ఈసారి గెలిచి తీరాల్సిందే..! ఖైరతాబాద్ ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు.. బలమైన అభ్యర్థి కోసం వేట..