IAS Priyanka Transfer: ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక ట్రాన్స్‌ఫర్.. అసలేం జరిగింది? ఆ మూడు అంశాలే బదిలీకి కారణమా?
క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో కమిషనర్ సక్సెస్ కాలేకపోయారన్న అసంతృప్తి జర్నలిస్టు వర్గాల్లో వ్యక్తమైంది. అంతేకాదు అక్రిడిటేషన్ కార్డుల కోసం సమాచార పౌర శాఖ తెచ్చిన జీవో వివాదాస్పదం అయ్యింది.
- Naveen
- Updated on- April 28, 2026 / 12:52 AM IST
- ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక ట్రాన్స్‌ఫర్ వెనుక ఏ జరిగింది..?
- జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డ్స్ జీవోల్లో గందరగోళం
- గద్దర్ అవార్డు వేడుకల నిర్వహణపై విమర్శలు, ఆరోపణలు
- మహిళా దినోత్సవ వేడుకల విషయంలోనూ విమర్శలే..
IAS Priyanka Transfer: ఆ పోస్ట్ ప్రభుత్వానికి ప్రజలకు వారధి. పైగా మీడియాకు..సర్కార్‌కు కోఆర్డినేట్ చేయడంలో కీ రోల్. అలాంటి కీలక పదవిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారిని అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. సమాచార పౌర సంబంధాల శాఖలో ఈ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ మూడు కారణాలే ఆమె ట్రాన్స్‌ఫర్‌కు దారితీశాయా? కీలక పోస్టుల్లో పని చేసిన అనుభవ లేకపోవడం వల్లే మేడమ్ పనితీరు విమర్శలకు దారితీసిందా?
తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంకను ప్రభుత్వం ఆ పోస్టు నుంచి తప్పించి..అక్కడెక్కడో ఉన్న నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే ఈ బదిలీకి కారణమేంటన్న దానిపై రకరకాల చర్చ జరుగుతోంది. మీడియాకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన ఐ అండ్ పీఆర్ కమిషనర్..అనుభవ రాహిత్యంతో వ్యవహరించిన తీరు చర్చకు దారితీస్తోంది. ప్రత్యేకంగా జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలో మార్చి మార్చి జీవోలు జారీ చేయడం గందరగోళానికి దారితీసింది.
అక్రిడిటేషన్ కార్డుల జారీలో తీవ్ర విమర్శలు..
గత ప్రభుత్వంలో అక్రిడిటేషన్ కార్డుల జారీలో అంతా సాఫీగా జరిగిపోతే..ఇప్పుడు మాత్రం తీవ్ర విమర్శల పాలైంది. కొత్త సర్కార్ కొలువుదీరి రెండేళ్లు దాటినా ఇప్పటికీ అక్రిడిటేషన్ కార్డుల జారీ జరగకపోవడం విమర్శల పాలైంది. జీవోల విషయంలో క్లారిటీ లేకపోవడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో కమిషనర్ సక్సెస్ కాలేకపోయారన్న అసంతృప్తి జర్నలిస్టు వర్గాల్లో వ్యక్తమైంది. అంతేకాదు అక్రిడిటేషన్ కార్డుల కోసం సమాచార పౌర శాఖ తెచ్చిన జీవో వివాదాస్పదం అయ్యింది. దీనికి వ్యతిరేకంగా..జర్నలిస్టులు ఆందోళనలు చేసిన పరిస్థితి.
ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. అంతేకాదు ఫిల్మ్, కల్చరల్, స్పోర్ట్స్ విభాగాలకు గతంలో ఉన్న అక్రిడిటేషన్ రద్దు చేయడం..సంఖ్యను కుదించడం విమర్శలకు దారి తీసింది. కమిషనర్‌గా పనిచేసిన ప్రియాంక.. ఫిల్మ్, కల్చరల్, బిజినెస్ విభాగాలకు అప్లై చేసుకుంటే అక్రిడిటేషన్లు ఇస్తామంటూ ఓరల్‌గా చెప్పడం వివాదం అయింది.
గద్దర్ అవార్డుల వేడుకల్లో చేసిన ఖర్చులపై ఆరోపణలు..
ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ అవార్డుల వేడుకలు, అలాగే ఉమెన్స్ డే వేడుకల నిర్వహణలో సమన్వయం మిస్ అయిందని కూడా ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ కార్యక్రమాల ఏర్పాట్లలో ప్రోటోకాల్ సమస్యలు, నిర్వహణ లోపాలు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. గద్దర్ వేడుకల్లో చేసిన ఖర్చులపైనా తెలంగాణ సినీ రంగ ప్రముఖుల నుంచి ఆరోపణలు వచ్చాయి. స్టేజ్ పర్ఫామెన్స్‌ల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్లు అలిగేషన్స్ ఉన్నాయి. నచ్చిన వాళ్లకు ఇష్టారీతిన అకామిడేషన్, రెమ్యునరేషన్ ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. అయినా ఆ స్థాయిలో కార్యక్రమం జరగలేదని ప్రభుత్వం భావించిందంటున్నారు.
ఇక ఉమెన్స్ డే వేడుకల సందర్భంగా ఉమెన్ జర్నలిస్టులకు ఆహ్వానం విషయంలో, అవార్డుల ఎంపికలో ఐ అండ్ పీఆర్ అధికారులు ఇష్టారాజ్యంగా, సమన్వయం లేకుండా వ్యవహరించారని కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చిందట. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని సీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో కీలక పోస్టుల్లో పనిచేసిన అనుభవం లేకపోవడంతో ప్రియాంక సమాచార శాఖను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని తెలుస్తోంది. ఇవన్నీ కూడా ప్రియాంక బదిలీకి కారణం అయ్యాయని సెక్రటేరియట్ వర్గాల టాక్.
ప్రభుత్వ ఇమేజ్‌ను ప్రజల్లోకి పాజిటివ్ వేలో తీసుకెళ్లాల్సిన సమాచార శాఖే..ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లు ఆ శాఖ మంత్రి కూడా పలుసార్లు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఎలాంటి జాప్యం లేకుండా, సమర్థవంతంగా పనిచేసే అధికారి కోసం ట్రాన్స్‌ఫర్ చేశారని అంటున్నారు. ప్రభుత్వ పథకాలపై సర్కార్‌కు రావాల్సినంత మైలేజ్ రాకపోవడం ఒక ఎత్తు అయితే..ప్రభుత్వానికి పాజిటీవ్ అంశాలను ప్రజలకు చేరవేయడంలోనూ ఐ అండ్ పీఆర్ శాఖ విఫలమైందన్న చర్చ కూడా మంత్రుల్లో ఉందట.
ఇక వచ్చేది ఎన్నికల సమయం..కీలక నిర్ణయాల సమయంలో సమాచార పౌర సంబంధాల శాఖలో లోపం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ బదిలీ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలక శాఖ పనితీరుతో ప్రభుత్వానికి రావాల్సినంత హైప్ రాకపోవడంతో ఐఏఎస్ ప్రియాంకను నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసి..ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా ముకుందరెడ్డికి బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. కొత్త కమిషనర్ ఐ అండ్ పీఆర్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Also Read: కవిత విమర్శలపై బీఆర్ఎస్ పెద్దల మౌనం.. ఎందుకు? రీజన్ అదేనా?
