అటు ఫిర్యాదుల వెల్లువ, ఇటు రాజకీయ ఒత్తిళ్లు.. ఏం చేయాలో తెలియని అయోమయంలో హైడ్రా..!

కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్‌ మదనపడుతున్నారని చెబుతున్నారు.

Gossip Garage : హైడ్రా.. హైదరాబాద్‌లో బడాబాబుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సంస్థ. అక్రమ కట్టడాల కూల్చివేతలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌గా మారింది హైడ్రా. చెరువుల్లో కబ్జాలను తొలగిస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకుంటోంది హైడ్రా… ఇదే సమయంలో హైడ్రా దూకుడికి కళ్లెం వేసేలా రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్‌ నేతలతోపాటు ప్రతిపక్ష నేతలు కూడా హైడ్రాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఫిర్యాదులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో హైడ్రా స్పీడ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వందల సంఖ్యలో ఫిర్యాదులు.. అయోమయంలో హైడ్రా…
గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నగరంలోని చెరువులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన హైడ్రా వరుసగా అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది. దీంతో హైడ్రా పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తమ ప్రాంతాల్లోనూ చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు జనం. ఇలా వందల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి పెరుగుతోంది. వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకునే పటిష్టమైన వ్యవస్థ హైడ్రా దగ్గర లేకపోవడంతో కొన్ని తీవ్రమైన ఆక్రమణలకే హైడ్రా పరిమితమైపోతోందని వాదన వినిపిస్తోంది. దీంతో వందలాదిగా వస్తున్న ఫిర్యాదులపై ఏం చేయాలన్న అయోమయంలో పడిపోయింది హైడ్రా.

హైడ్రాపై పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిళ్లు..
మరోవైపు హైడ్రాపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి మొదలు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా విద్యా సంస్థల భవనంపై బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో హైడ్రా అడకత్తెరలో పడిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉన్న ఎంఐఎంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఫాతిమా కళాశాల భవనాన్ని కూల్చే సాహసం చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్‌… గులాబీ దళాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆ పార్టీ నేతల ఇళ్లు, విద్యా సంస్థలు, ఫాం హౌస్‌లపై వరుస ఫిర్యాదులు చేస్తుండటం రాజకీయంగా హీట్‌ పెంచుతోంది.

Also Read : కేవలం హిందువుల నిర్మాణాలనే కూలుస్తున్నారు, ఒవైసీ సంస్థలను టచ్ చేసే ధైర్యం లేదా..?: హైడ్రా కమిషనర్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తనకు చెడ్డ పేరు వస్తుందని మదనపడుతున్న హైడ్రా చీఫ్…
ఇలా నేతల పోటాపోటీ ఫిర్యాదులపై ఏం చేయాలో తేల్చుకోలేకపోతోంది హైడ్రా. కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్‌ మదనపడుతున్నారని చెబుతున్నారు. అలా అని అధికార కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాల జోలికి వెళ్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న టెన్షన్‌ పడుతున్నారని చెబుతున్నారు. మొదట్లో చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సానుకూల స్పందన రావడంతో ఉత్సాహంగా స్పీడ్ పెంచిన హైడ్రా.. ఇప్పుడు జనం నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం, రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిని ఎదుర్కొంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు