Telangana Congress: అప్పుడు గూడెం మహిపాల్‌రెడ్డి, ఇప్పుడు పోచారం..! ఒకరి తర్వాత మరొకరు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు ఎందుకు?

వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు..మొదట్లో అప్పటికే ఉన్న కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా అన్నింటికీ ఓర్చుకొని పార్టీలో కంటిన్యూ అయ్యారు.

  • Published On : April 14, 2026 / 06:30 AM IST
  • ఫిరాయింపు నేతలు కాంగ్రెస్‌లో సెట్ కాలేకపోతున్నారా?
  • ఎమ్మెల్యేలు డా.సంజయ్, కృష్ణమోహన్‌రెడ్డిపైనా హామీల ఒత్తిడి
  • ఫిరాయింపు ఎమ్మెల్యేల టోన్ మారడానికి రీజనేంటి.?
  • ప్రభుత్వం ఉందా? నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ పోచారం ఫైర్

 

Telangana Congress: ఆల్ ఈజ్ వెల్. ఇక అన్‌స్టాపబుల్ అనుకున్నారు. కానీ ఒకరి తర్వాత మరొకరు అసంతృప్తి రాగం స్టార్ట్ చేశారు. ఇప్పటికే మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పగా..పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా గొంతెత్తుతున్నారు. జంపింగ్‌లలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు. లేటెస్ట్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ..ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నేతనే కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఎమ్మెల్యేలు వాయిస్ రైజ్ చేయడానికి రీజనేంటి.?

అధికార హస్తం పార్టీ గూటిలో ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ కామన్ అయిపోయింది. లేటెస్ట్‌గా నేతల అసంతృప్తి రాగం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి..రెండేళ్లుగా అసంతృప్తి రాగం వినిపిస్తూ వచ్చి..ఫైనల్‌గా హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో గూడెం మహిపాల్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ముందే యూటర్న్ తీసుకున్నారు. ఆయన సోదరుడు బీఆర్ఎస్‌లో చేరి పురపోరులో కారు పార్టీ గెలుపును కృషి చేశారు. గూడెం కూడా బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేయాలని పిలుపునివ్వడంతో పటాన్‌చెరులో మున్సిపాలిటీలను వార్‌ వన్‌ సైడ్ అన్నట్లుగా గెల్చుకుంది గులాబీ పార్టీ.

హామీలు నెరవేర్చలేదని అసంతృప్తి గళం..

లేటెస్ట్‌గా మరో జంపింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీ తీరుపై డైరెక్ట్ ఎటాక్‌ చేయడం చర్చకు దారితీస్తోంది. వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు..మొదట్లో అప్పటికే ఉన్న కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా అన్నింటికీ ఓర్చుకొని పార్టీలో కంటిన్యూ అయ్యారు. పవర్‌లో ఉన్న కాంగ్రెస్‌లో తాము చేరి రెండేళ్లు అవుతున్న సందర్భంగా తమకిచ్చిన హామీలు నెరవేర్చలేదని అసంతృప్తి గళం వినిపిస్తున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఇప్పుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఉంటే పని చేస్తుందా?

కాంగ్రెస్‌లోకి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చినా..అందులో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఎపిసోడ్ కాస్త డిఫరెంట్. పోచారంను పార్టీలోకి తీసుకునే సందర్భంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన నివాసానికి వెళ్లి మరీ ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. పోచారానికి ప్రభుత్వ ప్రొటోకాల్ కూడా ఇస్తూ .. సలహాదారు పోస్టు ఇచ్చారు. ఈ పోస్టు విషయంలోనే ఈ మధ్య పార్టీ మారిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలాయన ఇచ్చిన సలహా ఏంటంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా పక్కన పెడితే..పోచారం ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..ఉంటే పనిచేస్తుందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ బరస్ట్..

మంత్రులెవరూ ఎమ్మెల్యేల ఫోన్లు లిప్ట్ చేయట్లేదని అసహనం వ్యక్తం చేసిన పోచారం..నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ బరస్ట్ అయిపోయారు. తాను మంత్రిగా పనిచేసినా..ఎప్పుడూ ఇలా ఎమ్మెల్యేల ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఉండలేదన్నారు. గతంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చేవని..ఇప్పుడు సీఎంకు 20 సార్లు చెప్పినా పనులు కావట్లేదంటూ విరుచుకుపడ్డారు పోచారం. తన నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు ఇస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారంటూ విమర్శలు చేశారు.

ఇలా పోచారం ఒక్కరే కాదు..పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారట. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కూడా పార్టీకి మద్దతుగా ఉన్నందుకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడంపై తీవ్ర ఒత్తిడిలో ఉన్నారట. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వచ్చినా..ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసేందుకు జాప్యం జరుగుతుండటంలో ఆందోళన చెందుతున్నారట.

ప్రధానంగా జగిత్యాల నియోజకవర్గంలో యావర్ రోడ్డు పనులను పూర్తి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు సంజయ్. ఆ కీలక హామీని అమలు చేసేందుకే అధికార పార్టీలోకి వెళ్లి.. రెండేళ్లు అవుతున్నా..యావర్ రోడ్డు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడపోవడం ఎమ్మెల్యే సంజయ్‌ని కలవరపెడుతుందట. అటు గద్వాల్లో గట్టు లిఫ్ట్ పనులు చేపట్టి..పలు రిజర్వాయర్ల కెపాసిటీ పెంచితే..నియోజకవర్గంలోని ప్రజలకు మేలు కలుగుతుందని ఆశించారట గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి. కానీ పనుల ప్రారంభంలో జరుగుతున్న జాప్యం ఆయన్ను కూడా అసంతృప్తికి గురిచేస్తుందట.

ఇలా పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో..హస్త పార్టీ పెద్దలు, ప్రభుత్వంలోని కీలక నేతలు అలర్ట్ అవుతున్నారట. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పోచారం కామెంట్స్‌పై స్పందిస్తూ..ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వెసులుబాటును అర్థం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఇచ్చిన మాట ప్రకారం మెజారిటీ హామీలను అమలు చేసే పనిలో బిజీ అయ్యారట. జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా బతిమాలో..అసంతృప్తి వ్యక్తం చేసో..తమ నియోజకవర్గానికి పనులు చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందుల తప్పవని ఆందోళన చెందుతున్నారట. అందుకే ఇలాంటి కామెంట్స్‌తో సర్కార్‌పై ఒత్తిడి పెంచైనా సరే పనులు పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఫిరాయింపు ఎమ్మెల్యేల అసంతృప్తికి హస్తం పార్టీ పెద్దలు ఎలా చెక్ పెడుతారో చూడాలి.

Also Read: అన్న, చెల్లి టైటిల్‌ ఫైట్‌.. టీఆర్ఎస్ టైటిల్ చిక్కేది ఎవరికి? బీఆర్ఎస్‌.. టీఆర్ఎస్‌గా మారే అవకాశం ఉందా?