×
Ad

Local Body Elections: లోకల్ ఫైట్.. 42శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి? సర్కార్ ముందున్న ఆ 4 ఆప్షన్స్ ఏంటి?

ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై విచారించిన హైకోర్ట్.. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండగా..జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

CM Revanth Reddy

Local Body Elections: స్థానిక పోరు త్రిశంకు స్వర్గంలో ఉంది. ఓవైపు రిజర్వేషన్లపై హౌస్ మోషన్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అక్టోబర్ 8న కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అది అలా ఉండగానే లోకల్ బాడీ పోల్స్‌కు షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. కోర్టు తీర్పు పాజిటివ్‌గా వస్తే సరే. లేకపోతే ఏంటి పరిస్ధితి? బీసీ రిజర్వేషన్లను న్యాయస్థానం రద్దు చేస్తే సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసలు స్థానిక ఎన్నికలు జరుగుతాయా? లేదా?

తెంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఎపిసోడ్ టీవీ సీరియల్‌ను తలపిస్తోంది. ప్రతీ ఎపిసోడ్ ముగింపులో ట్విస్ట్ ఉన్నట్లు..లోకల్ బాడీ ఎన్నికలు..బీసీ రిజర్వేషన్లపై..ఎప్పుడూ ఏదో ఒక పేచీ వచ్చి పడుతూనే ఉంది. ఇప్పుడైతే ఏకంగా లోకల్ బాడీ ఎన్నికలకు సర్కార్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. అక్టోబర్ 9న నోటిపికేషన్ విడుదల చేయనుంది. అంతకంటే ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 8న బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది.
కోర్టు అలా చెబితే.. సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై విచారించిన హైకోర్ట్.. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండగా..జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అంతేకాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చెప్పింది. దీంతో ఈ నెల 8న బీసీ రిజర్వేషన్లను హైకోర్ట్ బ్రేక్ వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా..ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే ..పరిస్థితి ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడిదే అంశం ఇటు ఆశావాహులను..అటు ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోందట. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు హైకోర్టు నోచెబితే..లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటన్న క్యూరీయాసిటీ పెరుగుతోంది.

బీసీ రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేస్తే ప్రభుత్వం ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని తెలుస్తోంది. వాటిలో ఒకటి హైకోర్ట్ ఆర్డర్స్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లడం. రెండోది గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుకు ఆమోదం తీసుకోవడం. మూడోది ఎన్నికలను మరింత ఆలస్యం చేయడం. నాలుగోది పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించడం. ఈ నాలుగు ఆప్షన్లు ప్రభుత్వం ముందున్నాయి.

అయితే సుప్రీంకోర్టు 50శాతం క్యాప్ విధించిన నేఫథ్యంలో..పైకోర్టుకు వెళ్లే ఛాన్స్ తక్కువే. ఇక రెండో ఆప్షన్‌గా బిల్లుకు గవర్నర్ ఆమోదం పొందడం. ఇప్పుడు మరోసారి చివరి అవకాశంగా..బీజేపీని బీసీల ముందు దోషిగా నిలబెట్టే పొలిటికల్ గేమ్‌ను రేవంత్ సర్కార్ ఉపయోగించే అవకాశం ఉందట. ఇక ఎన్నికలను మరింత ఆలస్యం చేసే ఆప్షన్‌ను కూడా ఎంచుకునే ఛాన్స్ లేకపోలేదంటున్నారు.

ఇప్పుడున్న వాటిలో ఇదే సర్కార్ ముందున్న బెటర్ ఆప్షన్..!

అయితే ఇప్పటికే ఏడాదిన్నరగా పంచాయతీల్లో అధికారుల పాలన సాగతోంది. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధుల పంచాయతీలకు రావడం లేదు. ఈ పరిస్థితిలో ఎన్నికలు ఇంకా లేట్ చేస్తే.. ప్రభుత్వ పాలనపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఇక ఫైనల్‌గా పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం ప్రభుత్వం ముందున్న సేఫ్ ప్లాన్. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చిత్తశుద్దితో ప్రయత్నించినప్పటికీ..కేంద్రం సహకరించలేదని చెప్తూ..పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందట. ఇప్పుడున్న ఆప్షన్స్‌లో ఇదే సర్కార్ ముందున్న బెటర్ ఆప్షన్ అంటున్నారు.

లాస్ట్ ఆప్షన్ ప్రకారం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే..గతంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చినట్లు..బీసీలకు 23 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 9శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీ సంక్షేమ శాఖ ఈ రిజర్వేషన్లను ఖరారు చేస్తే..దీని ప్రకారంగా..పంచాయతీ రాజ్ శాఖ..కొత్తగా రిజర్వేషన్లు అలాట్ చేయనుంది. అయితే ఇది ప్రభుత్వానికి మరో సవాల్‌గా మారనుంది. మొన్న ఇచ్చిన జీవో ప్రకారం..బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తూ ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించారు.
పాత రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తే మళ్లీ మొన్న ఇచ్చిన రిజర్వేషన్లు అన్నీ మారిపోతాయి.

దీంతో ఇప్పటికే గ్రామాల్లో బెర్తుల కోసం పోటీ పడుతున్న ఆశావాహులను ఇది మరింత కలవరపెడుతోందట. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల తుట్టెను కదిల్చిన రేవంత్ సర్కార్..ఎలా సేఫ్‌గా ల్యాండ్ చేస్తుందనే డైలమా కొనసాగుతోంది. ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఎన్నికలకు వెళ్లడం తప్ప ప్రభుత్వం ముందు మరో మార్గం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే పాత రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తారా లేక కొత్తగా ఇంకేమైనా ప్రతిపాదనలు తెరమీదకు తెస్తారా అనేది చూడాలి.

Also Read: జగిత్యాలలో ఆరని మంటలు.. సొంత పార్టీపైనే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు.. ఏం జరుగుతోంది?