కంచుకోటల్లో బీఆర్ఎస్‌కు కష్టాలు.. కోరుట్లలో ఎమ్మెల్యేని ఏకాకి చేసేలా కాంగ్రెస్ స్కెచ్..!

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కు క్యాడర్ ను నిలుపుకోవడం సవాల్ గా మారింది. గతంలో ఆయన తండ్రి విద్యాసాగర్ రావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడంతో సంజయ్ కు చాన్స్ వచ్చింది.

Gossip Garage : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న కాంగ్రెస్.. తన వలకు చిక్కని వారికి చుక్కలు చూపుతోంది… వారి వారి నియోజకవర్గాల్లో బైఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు సృష్టిస్తూ సవాల్ విసురుతోంది. బీఆర్ఎస్ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ పునాదులనే షేక్ చేసేలా ఎత్తులు వేస్తోంది. తమ దారికి రాని ఎమ్మెల్యేలను డమ్మీలు చేస్తూ… ఓడిన నేతలకు ఫుల్ పవర్ ఇస్తూ… గులాబీ ఎమ్మెల్యేలను ఒంటరి చేస్తూ టార్గెట్ చేస్తోందట… బీఆర్ఎస్‌కు తిరుగులేదనుకున్న కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీని రకరకాల సమస్యలు చుట్టుముడుతుండటం కాంగ్రెస్ స్కెచ్‌లో భాగమేనంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ వేసిన స్కెచ్ ఏంటి?

ప్రతిపక్ష పాత్రలో ఇమడలేకపోతున్న కేడర్..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కంచుకోట కోరుట్ల నియోజకవర్గం. వరుసగా నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీయే గెలిచింది. 2009లో కోరుట్ల నియోజకవర్గం ఏర్పడితే ఇప్పటివరకు ఆ పార్టీయే గెలుస్తూ వస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా…. జగిత్యాల, కోరుట్లలో కారు పార్టీ జోరు చూపింది. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరిపోగా..కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాత్రం కారు దిగనంటూ మొండికేస్తున్నారట. దీంతో ఆపరేషన్ కోరుట్లను మొదలు పెట్టింది కాంగ్రెస్. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ కుటుంబానికి మంచి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త సవాల్ ఎదుర్కొంటోంది. 2009లో తొలిసారి గెలిచినా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్… 2014 నుంచి అధికారం అనుభవించడంతో ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఇమడలేకపోతున్నారు. గత ఏడాది పార్టీ అధికారం కోల్పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ పునాదులే షేక్ అవుతున్నాయంటున్నారు.

క్యాడర్ ను నిలుపుకోవడం సవాల్ గా మారింది..
ఇలా ముఖ్యమైన నేతలు అంతా కారు దిగేస్తుండటం సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కు తలనొప్పిగా మారింది. రోజురోజుకూ కండువాలు మార్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. బీఆర్ఎస్ డీలా పడుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కు క్యాడర్ ను నిలుపుకోవడం సవాల్ గా మారింది. గతంలో ఆయన తండ్రి విద్యాసాగర్ రావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడంతో సంజయ్ కు చాన్స్ వచ్చింది. ఐతే గెలిచిన తొలిసారి ఆయన ప్రతిపక్షానికి పరిమితం కావడంతో క్యాడర్ ను కట్టడి చేయలేకపోతున్నారంటున్నారు.

కాంగ్రెస్ వైపు చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు..
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పెద్ద ఎత్తున చేపట్టగా, సంజయ్ మాత్రం ఆకర్ష్ కు ప్రభావితం కాలేదని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మంచి సంబంధాలు ఉండటంతో బీఆర్ఎస్ లో కొనసాగేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఐతే ఇక్కడ కాంగ్రెస్ ప్లాన్ బీ అమలు చేస్తూ…. కోరుట్లలో కారును గ్యారేజ్ కు పంపేలా కార్యకర్తలపై ఫోకస్ చేసింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన జువ్వాడి నరసింగరావుకు కోరుట్లలో పూర్తి బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటం.. నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కన్నా జువ్వాడి మాటే చెల్లుబాటు అవుతుండటంతో గులాబీశ్రేణులు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయట. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పునాదులను గట్టిపరచుకోవాలనే ఉద్దేశంతో చురుగ్గా పావులు కదుపుతున్నారు జువ్వాడి నరసింగరావు. బీఆర్ఎస్ క్యాడర్ ను తనవైపు తిప్పుకుంటూ…. ఎమ్మెల్యేకు సవాల్ విసురుతున్నారు.

ఎమ్మెల్యే సంజయ్‌కు చుక్కలు చూపిస్తున్నారు..!
మాజీ మంత్రి దివంగత రత్నకరరావు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నరసింగరావు… ఇప్పటివరకు గెలవలేకపోయారు. కానీ, పార్టీ అధికారంలో ఉండటంతో ఇన్చార్జిగా కోరుట్ల రాజకీయాన్ని ఇప్పుడు శాసిస్తున్నారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తో సహ పలువురు కౌన్సిలర్లను కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. మెట్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో చేరేలా పావులు కదిపారు. మొత్తానికి నియోజకవర్గంలో ప్రధానమైన పట్టణాల్లో పట్టు సాధిస్తూ ఒక్కో అడుగే వేస్తున్నారు జువ్వాడి నర్సింగరావు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రాబల్యం కనిపించేలా పావులు కదుపుతున్న జువ్వాడి నరసింగరావు… ఎమ్మెల్యే సంజయ్‌కు చుక్కలు చూపిస్తున్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ జోరుకు కళ్లెం వేసేలా ఎమ్మెల్యే ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తిరేపుతోంది.

Also Read : బీజేపీ పద్ధతులను అస్సలు పాటించరు.. కమలం పార్టీలో కొరకరాని కొయ్యలా మారిన ఏలేటి? రహస్య అజెండా అమలు చేస్తున్నారా?

ట్రెండింగ్ వార్తలు