×
Ad

Cm Revanth Reddy: మళ్లీ నేనే సీఎం..! రేవంత్ రెడ్డి ధీమా వెనక అసలు కారణమేంటి?

పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండటంతో..ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు, ప్రతిపక్షాలు మాత్రం సీఎం కామెంట్స్‌ను జీర్ణించుకోలేకపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Cm Revanth Reddy: ఇప్పుడు నేనే. నెక్స్ట్‌ టర్మ్‌ కూడా నేనే. మళ్లీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. నేనే సీఎం అవుతా. మీటింగ్ ఏదైనా..వేదిక మరేదైనా ఇదే మాట చెప్తూ వస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన మాటల వెనుక ఉన్న నమ్మకమేంటి? అధిష్టానం రేవంత్‌పై వ్యక్తం చేస్తున్న విశ్వాసమా? తెలంగాణలో తనకు ఎదురులేదన్న ధైర్యమా? రేవంత్ వ్యాఖ్యల వెనుక అంతర్యమేంటన్నదే పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే పదేపదే రేవంత్‌ చేస్తున్న కామెంట్స్‌తో..సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు డైజెస్ట్ చేసుకోలేపోతున్నారట.

ఈ ఐదేళ్లే కాదు..రాబోయే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం. మళ్లీ తానే సీఎం అవుతా. పదేళ్లు ముఖ్యమంత్రి సీటులో ఉంటా. ఈ మాటకో లెక్కుంది. దానికో సెంటిమెంట్‌ ఉందంటూ..హిస్టరీని ఎగ్జాంపుల్‌గా చెప్తూ వస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మళ్లీ తానే సీఎం అంటూ రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీల్లో రకరకాల చర్చకు దారి తీస్తున్నాయి. కర్ణాటకలో సీఎం సీటుపై పవర్‌ షేరింగ్ కోసం జరుగుతున్న రచ్చ మీద స్పందిస్తూ..పదేళ్లపాటు తెలంగాణలో తన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్‌ సర్కార్‌ కొనసాగుతుందని చెప్పారు. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పకనే చెప్తున్నారు.

సీఎం రేవంత్ చెబుతున్న ఉదాహరణ ఇదే..

గతంలో కూడా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని పలుసార్లు కామెంట్స్‌ చేశారు రేవంత్. ఇందుకు రేవంత్ రెడ్డి ఓ ఉదాహరణ చెబుతున్నారు. 1994 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పవర్‌లో కొనసాగగా..2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్‌ రాజ్యమేలిందని గుర్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో 2024 నుంచి వచ్చే పదేళ్లు అంటే 2034 వరకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారని, తాను సీఎంగా ఉండి ప్రణాళికా బద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు.

హైకమాండ్‌కు తనపై విశ్వాసం ఉందన్న ధైర్యమా?

ఢిల్లీ వేదికగా మరోసారి తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడం ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి చెప్పిన టెన్ ఇయర్స్ పవర్ లాజిక్ బాగానే ఉన్నా..సీఎంగా తాను పదేళ్ల పాటు కొనసాగుతానని చెప్పడంపైనే చర్చ జరుగుతోంది. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, పైగా తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పడం వెనుక అంతర్యమేంటన్న చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డికి తనపై తనకున్న నమ్మకంతోనే ఇంతలా ధీమా వ్యక్తం చేస్తున్నారా? లేక కాంగ్రెస్ హైకమాండ్‌కు తనపై విశ్వాసం ఉందన్న ధైర్యమా? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. టెన్‌ ఇయర్స్‌ పవర్‌లో ఉంటామని..తాను సీఎంగా ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల అండతోనే..మళ్లీ తానే సీఎం అని రేవంత్ కామెంట్స్ చేస్తున్నారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

ఇటు తెలంగాణ ప్రజలను, అటు కాంగ్రెస్ హైకమాండ్‌ను సంతృప్తి పరిచేలా పరిపాలన చేస్తున్నామన్న నమ్మకంతో ఉన్నారట సీఎం రేవంత్. కచ్చితంగా రెండో దఫా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, మళ్లీ తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి కాన్ఫిడెంట్‌గా ఉన్నారనేది పార్టీ వర్గాల టాక్. ఇదే టైమ్‌లో రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక వ్యూహం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. గతంలో హైకమాండ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వట్లేదంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఎన్నోసార్లు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు ఇన్వైట్‌ చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిశారు.

ఈ సందర్భంగానే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ..రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు రేవంత్ రెడ్డి. హైకమాండ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఇండికేషన్‌ ఇచ్చేందుకు అలా మాట్లాడి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండటంతో..ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు, ప్రతిపక్షాలు మాత్రం సీఎం కామెంట్స్‌ను జీర్ణించుకోలేకపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: అర్బన్ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు: శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి