కిషన్ రెడ్డి అలా, రఘునందన్ రావు ఇలా.. హైడ్రాపై బీజేపీలో ఎందుకింత గందరగోళం?

హైడ్రా ప్రకంపనలు బీజేపీలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Gossip Garage : హైడ్రా.. హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాన పార్టీలు.. ముఖ్య నేతలు అంతా ఇప్పుడు హైడ్రా జపమే చేస్తున్నారు. కూల్చివేతలను హర్షిస్తున్న వారు ప్రశంసిస్తుంటే… ఓ సెక్షన్‌నే టార్గెట్‌ చేస్తున్నారని మరో వర్గం నేతలు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి పొలిటికల్‌గా హైడ్రా పార్టీలను హైఅలర్ట్‌ చేసింది. ప్రభుత్వం విధానం వల్ల కాంగ్రెస్‌ హైడ్రాను సమర్థిస్తుండగా, ప్రతిపక్షంలో మాత్రం గందరగోళం కనిపిస్తోందంటున్నారు. బీఆర్‌ఎస్‌ హైడ్రాను వ్యతిరేకిస్తుండగా, బీజేపీలో కొన్ని గొంతులు ప్రశంసలు… మరికొందరు స్పీకర్లు విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలు తలోమాట ఆడుతుండటంతో కేడర్‌ అయోమయాన్ని ఎదుర్కొంటోంది.

అయోమయంలో బీజేపీ కార్యకర్తలు..
హైడ్రా ప్రకంపనలు బీజేపీలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో చెరువుల్లో ఆక్రమణల తొలగింపునకు సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాను బీజేపీలో కొందరు నేతలు స్వాగతిస్తుండగా, మరికొందరు నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు. దీంతో పార్టీ ఏ విషయాన్ని చెబుతోందో తెలియని గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు కార్యకర్తలు.

బీజేపీలో భిన్నాభిప్రాయాలు…
గత నెల రోజులుగా హైదరాబాద్‌ నగరంలో హైడ్రా హల్‌ చల్‌ చేస్తోంది. సినీ నటుడు నాగార్జున ఎన్‌.కన్వెన్షన్‌ కూల్చివేతతో ట్రెండింగ్‌లోకి వచ్చింది హైడ్రా. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా హైడ్రా కోసమే చర్చించుకుంటున్నారు. దీంతో పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఇదే హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఐతే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో హైడ్రాపై స్పష్టమైన విధానం ఉండగా, బీజేపీ స్టాండే కన్ ఫ్యూజన్‌ అవుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా కార్యకలాపాలను కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా సమర్థిస్తుంటే.. బీఆర్‌ఎస్‌ అంతే స్థాయిలో వ్యతిరేకిస్తోంది. బీజేపీ మాత్రం కొంత సమర్థింపు, మరికొంత నిట్టూర్పుతో అయోమయం నుంచి బయటపడలేకపోతుందంటున్నారు.

కిషన్ రెడ్డి అలా.. రఘునందన్ రావు ఇలా..
హైడ్రాపై ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. గతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలే నిర్మాణాలకు అనుమతులిచ్చి.. ఇప్పుడు అదే ప్రభుత్వం కూల్చివేస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు కిషన్‌రెడ్డి. ఐతే ఇదే విషయంపై బీజేపీ ఎంపీ
రఘునందర్‌రావు రియాక్షన్‌ మరోలా ఉంది. సినీ నటుడు నాగార్జున ఎన్‌.కన్వెన్షన్‌ కూల్చివేతపై ప్రభుత్వానికి ఔట్‌ రైట్‌గా సపోర్ట్‌ చేశారు రఘునందన్‌రావు… మీరు కూల్చేయండి నేను చూసుకుంటా అన్నట్లు హైడ్రాను వెన్నుతట్టి ప్రోత్సహించారు రఘునందన్‌.

బీజేపీలో ఎందుకీ గందరగోళం?
ఇదే సమయంలో బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సైతం హైడ్రా కార్యకలాపాలకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నేతలకు చెందిన ఆక్రమణలను తొలగించాలని.. ఈ విషయంలో హైడ్రాకు తన సపోర్టు ఉంటుందని ప్రకటించారు రాజాసింగ్‌. ఇలా ఇద్దరు బీజేపీ ప్రజాప్రతినిధులు హైడ్రాకు మద్దతుగా మాట్లాడుతుండగా, ఇదే సమయంలో మరికొందరు ప్రజాప్రతినిధులు హైడ్రాకు వ్యతిరేకంగా గళం విప్పడంతో బీజేపీ ఏదో గందరగోళంలో చిక్కుకుంటోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అసలు కమలం పార్టీ స్టాండ్‌ ఏంటి?
రఘునందన్‌రావు, రాజాసింగ్‌ హైడ్రాను సపోర్టు చేస్తుంటే… బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హైడ్రా పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా హైడ్రా పేరిట బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇలా బీజేపీలో మెజార్టీ నేతల వ్యాఖ్యలకు రఘునందన్‌, రాజాసింగ్‌ మాటలకు పొంతన లేకపోవడంతో కమలం పార్టీ స్టాండ్‌ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడం కూడా ఈ గందరగోళానికి కారణమన్న టాక్ వినిపిస్తోంది.

హైడ్రాపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ నేతలు..
ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు ఎంపీ ఈటల రాజేందర్‌ హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదలు, 30-40 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్న వారి జోలికి వస్తే సహేంచేది లేదని.. ముందు నాలాల్లో పూడిక తొలగించాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో డీకే అరుణ సైతం హైడ్రాపై ఫైర్‌ అవుతున్నారు. ఆక్రమణలు జరిగాయని గుర్తిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట క్రమబద్ధీకరించి ప్రభుత్వం ఆదాయం సమూర్చుకునే మార్గం ఉందని.. కానీ, కాంగ్రెస్‌ నేతల ఆదాయం కోసం కూల్చివేతలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు ఎంపీ డీకే అరుణ. ఇక బీజేఎల్పీ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డి కూడా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కమిషనర్‌ రంగనాథ్‌పై ప్రివిలేజ్‌ మోషన్‌ ప్రవేశపెడతానని హెచ్చరించారు
మహేశ్వర్‌రెడ్డి.

పార్టీలో సమన్వయం లేదని మరోసారి రుజువు..
ఈ పరిస్థితుల్లో హైడ్రాపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అన్నింటికి మించి పార్టీలో సమన్వయం లేదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుండటంతో అయోమయం ఏర్పడుతోందంటున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వంలో అవసరమైన యంత్రాంగం లేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అరుదైన అవకాశం చిక్కినా పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోతోందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా బీజేపీలో కన్ ఫ్యూజన్‌ ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది.

 

Also Read : అటు ఫిర్యాదుల వెల్లువ, ఇటు రాజకీయ ఒత్తిళ్లు.. ఏం చేయాలో తెలియని అయోమయంలో హైడ్రా..!

ట్రెండింగ్ వార్తలు