×
Ad

Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికలు.. బీఆర్ఎస్ లైట్ తీసుకుందా? గులాబీ పార్టీలో స్తబ్ధతకు కారణం ఏంటి?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులను వడ్డుతుంటే ..

  • Published On : February 5, 2026 / 09:50 PM IST

Ktr

  • పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ
  • మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కారు జోరు ఎక్కడ?
  • ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం అయిన హరీశ్‌రావు..!
  • సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే తిరుగుతున్న కేటీఆర్

Telangana Municipal Elections: పురపోరులో సత్తా చాటుతామన్నారు. పంచాయతీ ఎన్నికల జోష్‌తో పట్టణాల్లోనూ తిరిగి పాగా వేస్తామన్నారు. ఇంచార్జ్‌లను కూడా నియమించారు. కట్ చేస్తే మాటల్లో చెప్పినంత గొప్పగా ఫీల్డ్‌ వర్క్ లేదట. అధికార పార్టీ దూకుడు మీదుంటే..కారు పార్టీ తడబడుతోంది. మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ లైట్ తీసుకుందా? ఎన్నికల బాధ్యతలను స్థానిక నాయకత్వానికి వదిలేసిందా? గులాబీ పార్టీలో స్తబ్ధతకు కారణం ఏంటి? బీఆర్ఎస్ కీలక నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితం అవ్వడం వెనుక ఆంతర్యమేంటి?

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో..జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి వరుస సభలకు అటెండ్‌ అవుతూ..గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ అటాకింగ్‌కు దిగుతున్నారు. అటు బీజేపీ కూడా జాతీయ స్థాయి నేతలతో బహిరంగ సమావేశాలు పెట్టి..అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌పై విమర్శల దాడి చేస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో మాత్రం మున్సిపల్ ఎన్నికల జోరు అంతగా కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకమని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. దీంతో ఈ ఎన్నికలను అధినాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందని భావించారట. అందుకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికలను బాధ్యతలను ఇంచార్జ్‌లు, స్థానిక నాయకులకే వదిలేశారట బీఆర్ఎస్ ముఖ్య నేతలు.

ఇంచార్జ్‌లు, లోకల్ లీడర్లకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు!

అభ్యర్థుల ఎంపిక, బీఫామ్‌ల కేటాయింపు..ప్రచార బాధ్యతలన్నీ లోకల్ లీడర్లే చూసుకుంటారని బీఆర్ఎస్ అధినాయకత్వం డిసైడ్ అయిందట. దీంతో గులాబీ లీడర్లు, క్యాడర్‌లో అయోమయం నెలకొందన్న చర్చ జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్, ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు సభలు సమావేశాలు పాల్గొంటారని ఆ పార్టీ క్యాడర్ భావించింది. కానీ సీన్‌ మరోలా ఉంది. అభ్యర్థుల సెలక్షన్‌, బీఫామ్‌లు, రెబల్స్ లేకుండా చూసుకోవడం..ఇలా అన్నింటినీ లోకల్ లీడర్లకు, లేకపోతే ఇంచార్జ్‌లకు అప్పజెప్పారట బీఆర్ఎస్ ముఖ్యనేతలు. దీంతో కారులో ఎవరికి వారే అన్నట్లుగా మారిందట మున్సిపల్ ఎన్నికల వ్యవహారం.

ఈ క్రమంలోనే పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు..ఆ పార్టీ నేతల ఇళ్ల ముందు నిరసనలకు దిగుతున్నారు. కరీంనగర్‌లో మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు పార్టీ బ్రోచర్లను తగలబెట్టి కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆమన‌గల్ మున్సిపాలిటీలో తమ ఇంచార్జ్ ముందే గులాబీ క్యాడర్ కుర్చీలు విసురుకున్నారు.

కాంగ్రెస్, బీజేపీ ప్రచార జోరు..

మరోవైపు అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చీ రాగానే పీసీసీ అధ్యక్షులు, మంత్రులతో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి..జిల్లాలను చుట్టేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 75శాతం స్థానాలను గెలుచుకుంటామని మంత్రులు సవాల్ విసురుతున్నారట. మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా పురపోరులో తగ్గేదేలే అంటోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చారంటే..కమలం లీడర్లు మున్సిపల్ ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

మున్సిపల్ ఎన్నికలను లైట్ తీసుకున్న బీఆర్ఎస్?

కేంద్రమంత్రి బండి సంజయ్ కాలికి బలపం కట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులను వడ్డుతుంటే ..రాష్ట్రంలో ప్రధాన పక్షంగా ఉన్న బీఆర్ఎస్‌ మాత్రం మున్సిపల్ ఎన్నికలను లైట్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలతో కేటీఆర్ సమీక్ష చేశారు. గెలుపే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. అయితే షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రం స్పీడ్ తగ్గించారన్న చర్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలను స్థానిక నాయకులు చూసుకుంటారని కేటీఆర్ స్వయంగా చెప్తున్నారట.

ఇంకోవైపు సొంత నియోజకవర్గం సిరిసిల్ల మున్సిపాలిటీకి మాత్రమే కేటీఆర్ పరిమితమయ్యారన్న చర్చ జరుగుతోంది. పక్కనున్న వేములవాడ మున్సిపాలిటీపై కూడా కేటీఆర్ అంతగా దృష్టి పెట్టడం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్‌రావు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారట. జిల్లాలో‌ మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార చేస్తూ..నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట హరీశ్‌. పురపోరు ప్రచారంలో కారు స్పీడు తగ్గడానికి కారణమేంటో..ఫలితాలు వస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

Also Read: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన.. ప్రచారానికి పవన్ సిద్ధం.. ఇక ఏం జరగబోతుంది?