×
Ad

BRS: పంచాయతీ ఎన్నికలను లైట్ తీసుకున్న బీఆర్ఎస్? కారణం అదేనా..?

పరిస్థితులు ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలపై పార్టీ చేతులు ఎత్తేస్తే రానున్న రోజుల్లో క్యాడర్ చేజారిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్‌లో అంతర్గత చర్చ జరుగుతోంది.

BRS: పార్టీ పవర్‌లో లేదు. పైగా సిచ్యువేషన్స్ బాలేవు. పోనీ పట్టుబట్టి అభ్యర్థులను గెలిచిపించినా..ఎన్నికయ్యాక వాళ్లు పార్టీలో ఉంటారో జంప్ అవుతారో తెలియదు. ఎందుకొచ్చిన టెన్షన్. లైట్‌ తీసుకుంటే పోలా అంటోందట బీఆర్ఎస్. అందుకే సర్పంచ్‌ ఎన్నికలపై గులాబీ పార్టీ సీరియస్‌గా ఫోకస్ పెట్టడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని జిల్లాల టూర్ చేస్తుంటే..బీఆర్ఎస్‌ మాత్రం కనీసం పట్టించుకోవడం కాదు కదా..ఓ సమీక్ష కూడా చేయకపోవడం చర్చకు దారితీస్తోంది.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రాజకీయం అంతకంతకు హీటెక్కుతోంది. నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అయితే పంచాయతీ ఎన్నికల వేళ..జిల్లా టూర్‌లో బీఆర్ఎస్‌పై విమర్శల దాడి చేస్తున్నారు.

ప్రజాపాలన రెండేళ్ల సంబరాల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న రేవంత్‌..సర్పంచ్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరాల జల్లులు కురిపిస్తున్నారు. వెళ్లిన చోటల్లా పెద్దఎత్తున నిధులను మంజూరు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి. సాధ్యమైనంత వరకు మెజారిటీ పంచాయతీలను గెలుచుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెబుతున్నారు. దీన్ని బట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

భారంగా మారిన ఫండింగ్?

అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం పంచాయతీ ఎన్నికలను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఇంకాస్త నిరాశ చెందిన గులాబీ పార్టీ ఇంకా దాని నుంచి బయటకు రాలేకపోతోందన్న చర్చ జరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎలాగూ అధికార పార్టీదే పైచేయి ఉంటుంది. పైగా పట్టుబట్టి అభ్యర్థులను పెట్టి గెలిపించినా వారు పార్టీలో ఉంటారో లేదోనన్న డైలమా ఉందట. అన్నింటికి మించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఫండింగ్ చేయడం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇంచార్జ్‌లకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారంగా మారనుంది.

మెయిన్‌గా అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌..

ఈ అంశాన్నింటిని దృష్టిలో పెట్టుకుని సర్పంచ్‌ ఎన్నికలను లైట్‌ తీసుకుందట బీఆర్ఎస్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉంటుంది కాబటి..అప్పుడు ఎంతో కొంత ఫోకస్ చేయాలని భావిస్తోందట. మెయిన్‌గా అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పని చేసుకుంటూ పోవాలనేది బీఆర్ఎస్ కారు పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. 20 నుంచి 30 నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గలో బీఆర్ఎస్ నేతలు పంచాయతీ ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలంగాణ భవన్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.

పార్టీ క్యాడర్‌ స్ట్రాంగ్‌గా ఉన్నచోట..ఎమ్మెల్యేలు అండదండలు ఉన్న దగ్గర..కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారట బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు. రాష్ట్ర పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదని..అంతర్గతంగా మాజీ మంత్రులు ఓసారి జిల్లాల వారీగా సమీక్ష చేశారని అంటున్నారు.

గెలిపించుకున్నా.. ఆ తర్వాత బీఆర్ఎస్ లోనే ఉంటారా?

పంచాయతీ ఎన్నికలను కారు పార్టీ లైట్‌ తీసుకోవడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను గెలిపించుకున్నా ఆ తర్వాత వాళ్లను అధికార కాంగ్రెస్‌.. పార్టీలో చేర్చుకుంటుందని బీఆర్ఎస్ భావిస్తోందట. ఇప్పటికే చాలాచోట్ల బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేయాలనుకున్న సర్పంచ్ అభ్యర్థులు..కాంగ్రెస్ నేతల ప్రలోభాలకు వెళ్లిపోయారని గులాబీ పార్టీ నేతలు వాపోతున్నారు. దీంతో కారు పార్టీ నుంచి పోటీ చేసేందుకు కొన్నిచోట్ల అభ్యర్థులు కూడా లేరన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ తాము బలపరిచిన అభ్యర్థులు గెలిచినా..అభివృద్ధి పేరుతో హస్తం గూటికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్‌ పార్టీ సర్పంచ్ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలపై పార్టీ చేతులు ఎత్తేస్తే రానున్న రోజుల్లో క్యాడర్ చేజారిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్‌లో అంతర్గత చర్చ జరుగుతోంది.

Also Read: పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి..! ఏంటా సమస్య? ఎందుకింత టెన్షన్?