సీఎం రేవంత్ చెప్పినా రుణమాఫీపై ప్రెస్‌మీట్ పెట్టని మంత్రి తుమ్మల..! ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?

రుణమాఫీపై ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీడియా ముందుకు రావడం లేదు. రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జూలై 18 నుంచి ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు.

Gossip Garage : ఆయనో సీనియర్ మినిస్టర్. ఓ రకంగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన రూటే సెపరేటు. ఆయన మాట్లాడే తీరే వేరు. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్‌లో కీలక పోర్ట్‌ ఫోలియో నిర్వహిస్తున్నారు. ఆయన దగ్గరున్న శాఖే రైతులకు కీలకం. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అందుకే నేను రాను బాబోయ్‌.. మీడియా ముందుకు అంటున్నారు ఆ అమాత్యులు. ఇంతకు ఆ మంత్రి మీడియాను ఫేస్‌ చేయాలంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు.? సమాధానం లేకా? సర్కార్ ఖజానాలో ఫైసలు లేవా.? మంత్రికే ఆ హామీ అమలు మీద డౌట్స్ ఉన్నాయా.?

కేవలం ప్రెస్‌నోట్లు ఇచ్చి సరిపెడుతున్న తుమ్మల..
తెలంగాణ ప్రభుత్వంలో ఆ కీలక మంత్రి తీరు హాట్ టాపిక్‌గా మారింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు.. 2 లక్షల రుణమాఫీ సమాధానం లేని సబ్జెక్ట్ అయిపోయింది. రుణమాఫీపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అపోజిషన్‌ అయితే అందరికీ రుణమాఫీ కాలేదని అటాక్ చేస్తూనే ఉంది. అయినా సంబంధిత మంత్రిగా ఉన్న తుమ్మల ప్రెస్ మీట్ పెట్టడం లేదు. స్వయంగా సీఎం చెప్పినా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. కేవలం ప్రెస్‌నోట్లు ఇచ్చి సరిపెడుతున్నారు తుమ్మల.

రూ.18 వేల కోట్లు విడుదల చేసినా అనుకున్నంత మైలేజ్ రాలేదని టాక్..
కొన్ని టెక్నికల్ కారణాలతో రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదు. ఆధార్‌లో పేర్లు తప్పుగా ఉండటం.. ఆధార్ సంఖ్యలో తప్పులు దొర్లడం, రెండు లక్షలపైన ఉన్న అమౌంట్‌ను చెల్లిస్తేనే రుణమాఫీ జరుగుతుందనే కండీషన్‌తో రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వం కూడా మొదట్లో 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కేవలం 18వేల కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసింది.

దీంతో బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. విపక్ష పార్టీల విమర్శలకు కౌంటర్‌ ఇవ్వడంలో వెనకబడిపోయామని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏకకాలంలో 18 వేల కోట్లు విడుదల చేసినా అనుకున్నంత పాజిటివ్ టాక్ రాలేదని చర్చించుకుంటున్నారు నేతలు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఈ మొత్తం వ్యవహారంను డీల్ చేస్తున్న వ్యవసాయశాఖ.. రైతులకు సరైన సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందిందనే విమర్శలు వస్తున్నాయి.

తుమ్మల తీరుపై ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో చర్చ..
రుణమాఫీపై ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీడియా ముందుకు రావడం లేదు. రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జూలై 18 నుంచి ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు. విపక్షాలు చేసిన విమర్శలకు కౌంటర్ కూడా ఇవ్వడం లేదు. స్వయంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినా.. ప్రెస్‌మీట్‌ పెట్టకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రుణమాఫీపై సంబంధిత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు మీడియా ముందుకు రాకపోవడంతో.. చేసేదిలేక ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. ఇప్పుడు ఈ టాపిక్ అటు ప్రభుత్వంలో.. ఇటు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరుపై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

రుణమాఫీపై మంత్రి గారే సంతృప్తిగా లేరా?
సంబంధిత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరావు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది డిస్కషన్ పాయింట్ అయింది. రుణమాఫీపై మంత్రే సంతృప్తిగా లేరా.. లేక లోన్‌ మాఫీపై తుమ్మలకే అనునామాలు ఉన్నాయా.. లేకపోతే ఆయన వ్యవహారశైలినే అలా ఉంటుందా అర్థం కాక తల పట్టుకుంటున్నారు హస్తం పార్టీ లీడర్లు.

Also Read : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు