Gossip Garage: ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ మొన్నటి వరకు హాట్ టాపిక్‌గా కొనసాగింది. రాష్ట్ర వ్యవహాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవి దగ్గరకు వ్యవహారం వెళ్లింది. అయినా రెండు వర్గాలు తగ్గకపోవడంతో ఫైనల్‌గా మ్యాటర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరడంతో ఇటు కొండాతో అటు ఎమ్మెల్యేలతో మాట్లాడి సెట్ చేశారని టాక్. కొండా దంపతులు..ఓరుగల్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వేర్వేరుగా మాట్లాడారట. దీంతో సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు ఇప్పుడు తమ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అంటున్నారు.
ఒకానొక దశలో కడియం, రేవూరి, నాయిని రాజేందర్‌రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు తాము కావాలో..కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలంటూ ఇంచార్జ్‌కు అల్టిమేటం జారీ చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు కూడా తమ వాదన బలంగా వినిపించారు. కానీ సీఎం రేవంత్ ఎంట్రీతో అంతా చల్లబడ్డారట.
ఒకవైపు ఎమ్మెల్యేలతో.. మరోవైపు మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో సీఎం స్వయంగా మాట్లాడారు. కొండా మురళితో దాదాపు గంటకు పైగా సీఎం సమావేశమై సమస్యకు పుల్‌స్టాప్ పెట్టాల్సిందిగా కోరారట. పంచాయితీ ఇలాగే కొనసాగితే.. త్వరలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని.. రెండు వర్గాలకు నచ్చజెప్పారట. కొండా మురళి కూడా సీఎం స్వయంగా పిలిపించుకొని మాట్లాడటంతో..తమ ప్రయత్నమంతా పార్టీ కోసమే..అలాంటప్పుడు పార్టీకి డ్యామేజ్ చేస్తామా అంటూ సైలెంట్‌గా ఉండేందుకే ఓకే చెప్పారట. ఎమ్మెల్యేలు కూడా కూల్ అయిపోయారు.
కొండా మురళికి భయపడుతున్నామా బొంగేం కాదంటూ మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి..ఇప్పుడు తమ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం మేం, మేం చూసుకుంటామంటూ కూల్ డౌన్ అయ్యారట. ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో కొండా ఫ్యామిలీ పైచేయి సాధించిందనేది గాంధీభవన్ టాక్. వరంగల్ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి. ఇలా ఈ వ్యవహారం కూల్ కావడంతో మరోసారి ఓరుగల్లు కాంగ్రెస్‌లో కొండా పైచేయి సాధించారనే టాక్ నడుస్తోంది.
పలువురు ఎమ్మెల్యేల గెలుపులో కొండా మురళి పాత్ర..
తమ కుటుంబం మీద వ్యతిరేక గ్రూపు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను రేవంత్ దగ్గర ప్రస్తావించారు కొండా సురేఖ. అయితే కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దని జిల్లాలోని ఎమ్మెల్యేలకు చెప్పాలని పీసీసీ చీఫ్‌ను ఆదేశించారట సీఎం రేవంత్. కొండా ఫ్యామిలీ అండ పార్టీకి వరంగల్ జిల్లాలో చాలా అవసరం అని అన్నారట. మొన్నటి ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేల గెలుపులో కొండా మురళి పాత్ర చాలా ఉందన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తించటం లేదని రేవంత్ అన్నట్లు ప్రచారం.
ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని..అనవసరంగా ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టొద్దని చెప్పారట సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశం నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.