TCUR: జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ (TCUR) విస్తరింపును ప్రభుత్వం పూర్తి చేసింది. కోర్ అర్బన్ రీజియన్‌లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. విలీన ప్రక్రియ మార్పులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయని ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, 1955 (1956 చట్టం నెం. II) తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. TCUR-GHMC ప్రాంతాన్ని విస్తరించడంపై జీఓ 264 జారీ చేసింది. కోర్ అర్బన్ రీజియన్ నోటిఫికేషన్ కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
అటు గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం టిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్‌లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.
దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అనే పేరు ఇక చరిత్రలో కలిసిపోనుంది. ఆరు జోన్లు, 30 సర్కిళ్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా మారింది. ఢిల్లీలో ఇలాగే ఎన్సీఆర్ (నేషనల్ కేపిటల్ రీజియన్) ఉన్న విషయం తెలిసిందే. ఆ తరహాలోనే హైదరాబాద్‌లో టీసీయూఆర్.