Tabla: హైదరాబాద్ సంగీత వారసత్వానికి ప్రతీక.. 160 ఏళ్లుగా గౌలిగూడలో…

హైదరాబాద్ లో ఈ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారం గొప్ప సంగీత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Gowliguda Tabla making shop conserve music heritage of Hyderabad

Tabla Shop: సంగీతంలో తబలా, ఢోలక్ (Dholak) వాయిద్య పరికరాలు శ్రోతలను రంజింపజేస్తాయి. ఈ కీలక సంగీత వాయిద్య పరికరాలకు హైదరాబాద్ (Hyderabad) కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మార్కెట్లో ఎలక్ట్రానిక్ వాయిద్యాల హోరును తట్టుకుని తకధిన తోం అంటూ తబలా సహజ ధ్వనులతో సంగీత ప్రియులను (Music Lovers) ఆకట్టుకుంటోంది.

ఈ తబలాలు తయారు చేసే దుకాణం ఎక్కడో కాదు.. హైదరాబాద్ లోని గౌలిగూడలో (Gowliguda) ఉంది. గత 160 ఏళ్లుగా ఈ సంగీత వాయిద్యాల షాపు కొనసాగుతోంది. ఈ షాపులో తబలాతో పాటు ఢోలక్, కాంగో, బోంగో, మృదంగం వంటి సంగీత వాయిద్యాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ షాపును మహబూబ్ అలీ ప్రారంభించగా.. ఆయన వారసులు తబలా మేకర్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ అలీ మనవడు మహ్మద్ షాబాజ్ తబలాల షాపు నడుపుతున్నారు. ఆధునిక డిమాండ్లకు అనుగుణంగా తబలా తదితర సంగీత వాయిద్యాలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారం గొప్ప సంగీత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. సంగీత వాయిద్యాల తయారీ కోసం వివిధ ప్రాంతాలను ముడి సరుకులను దిగుమతి చేసుకుంటున్నట్లు షాపు యజమాని తెలిపారు.

ఆధునిక పరికరాలు మార్కెట్లోకి ప్రవేశించడంతో తమ వ్యాపారానికి సవాల్ గా మారిందని షాబాజ్ తెలిపారు. తబలా, ఢోలక్ల స్థానంలో ఎలక్ట్రానిక్ సంగీత వాయిద్యాలు వచ్చాయన్నారు. అయితే హ్యాండ్మేడ్ తయారీ వాయిద్యాలతో సహజ ధ్వని వస్తుందన్నారు షాబాజ్. గౌలిగూడలోని ఈ తబలా షాపు కేవలం వ్యాపార స్థలం మాత్రమే కాదు.. సంప్రదాయానికి సంరక్షకుడిగా నిలిచింది. హైదరాబాద్ సంగీత వారసత్వాన్ని ఎలుగెత్తి చాటుతోంది.

Also Read: చంద్రయాన్-3ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?