తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి 90 నామినేషన్లు

Graduate MLC elections : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి టీఆర్ఎస్‌ తరపున మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణీదేవి నామినేషన్‌ దాఖలు చేశారు.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ కుమార్తె సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నికల బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు.

ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌ నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్స్ స్థానానికి మొత్తం 90 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఒక్కరోజే 47 నామినేషన్లు వచ్చాయి.

ఇక నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణిరుద్రమ, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు స్థానాలకు ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగియనుంది.