Hafeez Peta land dispute : ఇప్పుడు అందరి దృష్టి హఫీజ్‌పేట్ భూ వివాదంపైనే ఉంది. సుమారు 25 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావ్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియల మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలున్నాయి. అసలు హాఫీజ్‌పేట్ భూ వివాదానికి భూమా కుటుంబానికి ఏమిటీ సంబంధం… ఇందులో ఏవీ సుబ్బారెడ్డి ఎలా వచ్చాడు… ప్రవీణ్ రావ్ సోదరులు చేస్తున్న ఆరోపణలు ఏంటి. ఇప్పుడు సర్వాత్రా ఆసక్తిగా మారింది.
భూమా నాగిరెడ్డి కీలక నేత : –
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి అత్యంత కీలకమైన నేత. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన నాగిరెడ్డి కుటుంబం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక పదవులు నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎంపీగా వ్యవహరించిన భూమా నాగిరెడ్డికి పలు వ్యాపారాలున్నాయి. భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా నంద్యాల ప్రాంతానికి చెందిన ఏవీ సుబ్బారెడ్డితోనే వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ప్రస్తుతం నంద్యాల టీడీపీలో కీలక నేతగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి అనుచరుడిగా వ్యవహరించారు. భూమా నాగిరెడ్డి మరణం, అఖిలప్రియకు మంత్రి పదవి తర్వాత ఏవీకి భూమా కుటుంబంతో విభేదాలు పెరిగాయి. ఓ దశలో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ కలిసి తనను హత్యచేయడానికి చూస్తున్నారంటూ ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇందుకోసం సుపారీ కూడా ఇచ్చారని ఏవీ సుబ్బారెడ్డి పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు.
ఏవీ సుబ్బారెడ్డి, భూమా కుటుంబాలు : –
భూమా నాగిరెడ్డికి చెందిన పలు బినామీ ఆస్తులు ఏవీ సుబ్బారెడ్డి పేరిట ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇందుకోసమే ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. అయితే నంద్యాలలో ఉప్పు – నిప్పులా ఉంటోన్న ఏవీసుబ్బారెడ్డి – భూమా కుటుంబాలు హఫీజ్ పేట్ భూవ్యవహారంలో కలిసిపోయాయా? రెండు వర్గాలూ కలిసికట్టుగానే కిడ్నాప్‌నకు స్కెచ్ వేశాయా? అనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. హాఫీజ్‌పేట భూవివాదంపై హైదరాబాద్ సీపీ ప్రెస్ మీట్ ద్వారా ఏపీ రాజకీయాలకు సంబంధించి కొత్త కోణం తెరపైకి వచ్చింది. కిడ్నాపర్లు పలుమార్లు అఖిలప్రియ, భార్గవరామ్, సుబ్బారెడ్డిల పేర్లు ప్రస్తావించారని… అలాగే ఈ ముగ్గురితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.
మాజీ ప్లేయర్ ప్రవీణ్ రావు : –
ప్రధానంగా మూడు కుటుంబాల మధ్య భూ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి ఉన్న కాలంలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ ప్రవీణ్ రావు కుటుంబం కలిసి హఫీజ్‌పేట్‌లో 50 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు తమ వంతు వాటా కింద డబ్బులు తీసుకుని పక్కకు తప్పుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అక్కడ 20 ఎకరాల భూమి ప్రవీణ్ రావు కుటుంబం పేరిట ఉన్నట్లు తెలుస్తోంది.
విబేధాలు : –
భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఈ భూ వ్యవహారంపై ప్రవీణ్ రావు కుటుంబంతో ఫోన్ ద్వారా ఒకసారి సంప్రదించినట్లు చెప్తున్నారు. అయితే భూమా నాగిరెడ్డి ఐదారేళ్ల క్రితమే తన వాటాను అమ్మేసుకున్నారని… ఆ డబ్బులు కూడా ఇచ్చేశామని ప్రవీణ్ రావు కుటుంబం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ ఎన్నడూ ఆ కుటుంబాన్ని టచ్ చేయని అఖిలప్రియ.. ఇలా ఉన్నట్లుండి వారిని కిడ్నాప్ చేయించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూమా కుటుంబానికి, వాళ్ల పార్ట్‌నర్స్‌కు మధ్య విబేధాలున్నాయని, ఆ విభేదాల్లోకి ఇప్పుడు తమను లాగే ప్రయత్నం చేస్తున్నారని ప్రవీణ్ రావు కుటుంబం ఆరోపిస్తోంది. భూ వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని… వారి పార్ట్‌నర్స్‌తో తేల్చుకోవాలని అఖిలప్రియకు గతంలోనే చెప్పినట్లు ప్రవీణ్ కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు.
ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డ 15 మంది: –
మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఇన్‌కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ పేరు చెప్పి మొత్తం 15 మంది వ్యక్తులు బోయిన్‌పల్లిలోని ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డారు. ఆయనతో పాటు ఆయన సోదరులు సునీల్ రావు, నవీన్ రావులను వేర్వేరు గదుల్లో నిర్బంధించి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బోయిన్‌పల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ను చేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కార్ల నంబర్లను గుర్తించి… లంగర్ హౌస్ సమీపంలో నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరైన చంద్రబోస్ అనే వ్యక్తి భూమా అఖిలప్రియ బంధువుగా తెలుస్తోంది. అతని నుంచి రాబట్టిన వివరాల మేరకే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్‌లతో పాటు ఏవీ సుబ్బారెడ్డిలపై కేసు నమోదు చేశారు.
భూమా నాగిరెడ్డి కీలక నేత : –
ముందుగా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని విచారించిన పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. భూ వివాదంపై ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో మరో ముద్దాయి అఖిలప్రియ భర్త భార్గవ రామ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోట్ల విలువైన భూ వివాదంలో ముగ్గురి కిడ్నాప్‌నకు పథకం రచించిన నిందితుడు, అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ బెంగళూరులో ఉన్నట్లుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు సమాచారం సేకరించారు. ముగ్గురిని అపహరించడం కోసం గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందిన 15 మందిని భార్గవరామ్ రప్పించాడు. నిందితులు కిడ్నాప్ అనంతరం పోలీసులకు దొరక్కుండా టోల్‌ప్లాజాలు లేని సర్వీస్ రోడ్లను ఎంచుకుని బెంగళూరు వైపు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా 4 బృందాలను నియమించారు. భార్గవ్‌రామ్‌కు నేరచరిత్ర ఉందని, పలు ఆర్థిక నేరాల్లో ఆయన పాత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్న భార్గవరామ్.. బాధితులను భౌతికంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు కూడా వెనకాడబోడని నివేదికలో వివరించారు.