కాంగ్రెస్ చెప్పిన విషయం ఉత్తమాటే: మాజీ మంత్రి హరీశ్ రావు

ఔట్ సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్స్ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉందని హరీశ్ రావు తెలిపారు.

Harish Rao

తెలంగాణలో ప్రతినెల ఒకటో తేదీనే వేతనాల చెల్లింపు ఉంటుందని కాంగ్రెస్ చెప్పిన మాట ఉత్తమాటేనంటూ మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 13 రోజులు గడిచినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదని చెప్పారు.

ఔట్ సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్స్ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉందని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాల పొడిగింపు జులై 31 వరకే ఇవ్వడం దుర్మార్గమని చెప్పారు. పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న1,654 మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు.

విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగాలు నిలిపివేస్తే, బతికేది ఎలా అని లెక్చరర్లు, వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా 42 వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న సగం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించారని హరీశ్ రావు అన్నారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి టీచర్లను గౌరవించి ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Also Read: మంచైనా, చెడైనా ట్రోల్ చేస్తారు.. మీరు నన్ను ట్రోల్ చేయలేదా?: నిమ్మలకు అంబటి కౌంటర్

ట్రెండింగ్ వార్తలు