harish rao counter cm revanth reddy comments on kcr in telangana assembly
Telangana Assembly Budget Session 2024: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది. అనంతరం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చర్చలో పాల్గొన్నారు. తమపై బురద చల్లేందుకు, ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని అన్నారు. సీఎం రేవంత్ సభలో రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారని హరీశ్‌రావు అనడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు.
తెలంగాణ సమాజానికి నీళ్లు అనేవి ప్రాణాధారమని, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు కృష్ణా నది నీళ్లపైనే ఆధారపడి ఉందని సీఎం రేవంత్ తెలిపారు. నదీజలాలు, ప్రాజెక్టులపై అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని విమర్శించారు. సభకు రాకుండా ఎందుకు ముఖం చాటేశారని కేసీఆర్ ను ప్రశ్నించారు. పదేళ్లలో జరిగిన పాపాలకు కేసీఆర్ కారణమని, ఆయన సభలోకి వస్తే ఎంతసేపైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. చేపల పులుసుకు అలుసు ఇచ్చి.. కృష్ణా జలాలను ఎవరు తెగనమ్ముకున్నారో చర్చిద్దామన్నారు.
కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు..
”మహబూబ్ నగర్ జిల్లా నుంచి 10 లక్షల మందిపైగా వలస వెళ్లారు. 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరిమితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యోపాపని ఆదరించి ఎంపీగా గెలిపించారు. ఇవాళ ఆ జిల్లాకు సంబంధించిన కీలక చర్చ జరుగుతుంటే శాసనసభకు రాకుండా ఫాంహౌస్ పడుకుని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా? ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నపుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సాగునీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పేది లేదు. కృష్ణా నది నీళ్లు 68 శాతం తెలంగాణకు ఇవ్వాలని ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టినపుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికితే.. తెలంగాణ సమాజం అంతా ఒకే మాట మీద నిలబడ్డామన్న సందేశం ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది.
ఇలాంటి సందర్భంలో సభకు రాకుండా ఫాంహౌస్ లో దాక్కుని ప్రజలను తప్పుదోవ పట్టించడానికే హరీశ్‌రావును పంపించారు. మొన్న నేను చూసినప్పుడు ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంది. ఈరోజు ఆ కుర్చీలో పద్మారావు కూర్చున్నారు. కనీసం ఆయనకైనా ప్రతిపక్ష నేత బాధ్యత ఇస్తే సమర్థవంతంగా నెరవేరుస్తారు. పద్మారావు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయనలాంటి వారిని విపక్ష నేతగా పెడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ప్రాజెక్టులపై మేము పెట్టిన తీర్మానానికి అనుకులామా, వ్యతిరేకమా అనేది బీఆర్ఎస్ స్పష్టం చేయాల”ని సీఎం రేవంత్ అన్నారు.
Also Read: కేసీఆర్ ముక్కు నేలకురాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి
కొడంగల్ నుంచి తరిమితే మల్కాజ్‌గిరికి వచ్చావా?
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ”కేసీఆర్ ను కరీంగనర్ నుంచి తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని ఈయనగారు అన్నారు. కేసీఆర్ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడు. సిద్ధిపేట, గజ్వేల్, కరీంనగర్, మహబూబ్‌నగర్.. ఎక్కడా ఓడిపోలేదు. మరి నిన్ను కొడంగల్ నుంచి తరిమితే మల్కాజ్‌గిరికి వచ్చావా? నువ్వెందుకొచ్చావ్ మల్కాజ్‌గిరికి? ఒక వేలు మావైపు చూపిస్తే.. రెండు వేళ్లు మీవైపు చూపిస్తాయి. మేము మీ కంటే దీటుగా, ఘాటుగా సమాధానం చెప్పగలమ”ని హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.