భద్రాచలం వద్ద భారీగా గోదావరి ప్రవాహం… మూడో ప్రమాద హెచ్చరిక జారీ

  • Publish Date - August 16, 2020 / 04:44 PM IST

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. నీటి ప్రవాహం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలో మరింత వరద ఉధృతి పెరుగుతుందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.



భద్రాద్రి ఆలయ తూర్పు మెట్ల వరకు నీరు చేరింది. ఇప్పటికే రామయ్య ఆలయ అన్నదాన సత్రం, కళ్యా ణకట్ట, స్నానఘట్టాలు నీటమునిగాయి. ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పట్టణ ప్రజలకు స్థానిక పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేశారు.



ఎగువన నుంచి నీటి ప్రవాహం వస్తున్నందున నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా వరద ఉధృతిని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్షించారు. గోదావరిపై ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. 2005 తర్వాత ఖమ్మంలోని మున్నేరు వాగు మళ్లీ ఉప్పొంగిందని, తాలిపేరు, కిన్నెరసారి తదితర ప్రాజెక్టులన్నీ పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులందరినీ అప్రమత్తం చేశామని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు.



గోదావరిలో వరద ఉధృతి పెరిగితే మరింత మందిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ట్రెండింగ్ వార్తలు