Hyderabad Rain: హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. జడివానకు నగరం చిగురుటాకులా వణికింది. రికార్డ్ స్థాయిలో వర్షం పడింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. కొన్ని చోట్ల నడుము లోతు వరకు వరద నీరు చేరింది.
రోడ్లపైకి భారీగా వరద వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వరద కారణంగా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి ముందుకి పోలేక, వెనక్కి రాలేక వాహనదారులు నరకం చూశారు. ఆకస్మిక వరద కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, ఆసిఫ్ నగర్ లోని మంగారు బస్తీలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయారు. వారిద్దరిని మామ, అల్లుడిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్జల్ సాగర్ నాలా దాటుతుండగా వారిద్దరు అందులో పడిపోయినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. నాంపల్లి, ఖైరతాబాద్, సోమాజీగూడ, పంజాగుట్టలో కుండపోత వానకి రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. యూసఫ్ గూడ, బోరబొండ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్ లోని లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్ పేటలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నెమ్మదిగా కదిలాయి.