Telangana Rain Alert: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో కంట్రోల్ రూంలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం పడగా.. శనివారం వాతావరణం చల్లబడింది.
- Harishth Thanniru
- Published On : August 19, 2023 / 07:18 AM IST
TS Rain Alert
Heavy Rain Telangana: తెలంగాణ (Telangana) లో మళ్లీ భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు (శని, ఆది) రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
Rain (File Photo)
వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉంది. రెండు మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా – ఉత్తర ఛత్తీస్‍గఢ్ వైపు వెళ్లే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Rain (File Photo)
శనివారం ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం అదిలాబాద్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబాబాద్, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో గ్రీన్ అలర్ట్ ప్రకటించారు.
Rain (File Photo)
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడిజిల్లాల పరిధిలోని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి అప్రమత్తం చేశారు. ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టరేట్‌ల పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
Rain (File Photo)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. శనివారం ఉదయం వాతావరణం చల్లబడటంతో పాటు పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. శని, ఆదివారాల్లో భాగ్యనగరంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులుతెలిపారు.
