Rain Alert : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
Rain Alert : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- August 23, 2026 / 10:40 AM IST
weather Updates
AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Also Read : Nellore YSRCP Politics : నెల్లూరు వైసీపీలో సీనియర్ల మధ్య ఫైట్.. ఆ యువనేతకు ఎసరు..! అసలేం జరుగుతోంది?
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇవాళ విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా మారి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఉత్తర తెలంగాణ ప్రాంతాలు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, బెల్లంపల్లి, జగిత్యాల, నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
