Mahesh Kumar Goud: గతంలో కాపాడాం.. ఇకపై కుదరదు.. కొండా సురేఖకు ముగిసిన ఆప్షన్లు? TPCC చీఫ్ సంచలన హెచ్చరిక
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు.
Tpcc chief mahesh goud warns konda surekha and susmita over party discipline
- కొండా సుస్మితపై క్రమశిక్షణా వేటు
- పార్టీ లైన్ దాటితే చర్యలు
- ముఖ్యమంత్రిపై విమర్శల ఖండన విధి
Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠాన లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేసిన కొండా సుస్మిత తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి నేరుగా విమర్శలు చేయలేదని, కానీ సుస్మిత బాహాటంగా మాట్లాడటంపై సీరియస్గా ఉన్నామని తెలిపారు. గతంలో మంత్రి కొండా సురేఖను కాపాడామని, అయితే ఈసారి పరిస్థితి వేరుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉందని ఆయన వెల్లడించారు.
క్రమశిక్షణా కమిటీ కీలక సమావేశం:
రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో కీలక భేటీ నిర్వహించారు. సమావేశం అనంతరం మల్లు రవి మాట్లాడుతూ, కొండా సురేఖ ఇచ్చిన వివరణతో పాటు కొండా సుస్మిత మాట్లాడిన వీడియోలను పరిశీలించినట్లు తెలిపారు. సుస్మిత వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని భావిస్తున్నామని, దీనిపై మరిన్ని వివరాలు సేకరించి మరోసారి సమావేశమవుతామని చెప్పారు. అలాగే సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలు, ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
వివరణలు కోరిన కమిటీ.. తుది నిర్ణయంపై ఉత్కంఠ:
మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై అధ్యయనం చేశామని, ఈ అంశంలో ఎమ్మెల్యే మేఘరెడ్డి నుంచి కూడా వివరణ తీసుకోనున్నట్లు మల్లు రవి తెలిపారు. ఆదిలాబాద్ రాజకీయంపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు డీసీసీతో మాట్లాడాక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశాక మధు యాష్కీపై వ్యాఖ్యలు చేసినందున ఆయనపై చర్యలు అనివార్యమయ్యాయని పేర్కొన్నారు. కేబినెట్ మంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రిపై ఎవరు వ్యాఖ్యలు చేసినా ఖండించాల్సిన బాధ్యత కొండా సురేఖపై ఉందన్నారు. కొండా సురేఖతో పాటు ఇతరుల వివరణలపై కూలంకషంగా అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
