CM Chandrababu: డీఎస్సీలో అక్రమాలు జరగలేదు.. వైకాపా కుట్రలపై చంద్రబాబు ఫైర్.. అనకాపల్లి వేదికగా సంచలన వ్యాఖ్యలు
మెగా డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) స్పష్టం చేశారు.
CM Chandrababu clarified that no irregularities took place in Mega DSC recruitment
- మెగా డీఎస్సీలో అవకతవకలు లేవు
- మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ
- వైకాపా కుట్రలపై చంద్రబాబు మండిపాటు
CM Chandrababu: మెగా డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, సంపూర్ణ పారదర్శకతతోనే పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu)స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎ.కోడూరులో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్రీడా కోటాను అమలు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం మెరిట్ ప్రాతిపదికన వేలాది ఉద్యోగాలు ఇస్తుంటే.. తట్టుకోలేక వైకాపా నేతలు ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా 350కి పైగా పిటిషన్లు వేసి అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ అరాచకాలపై తీవ్ర విమర్శలు:
గత వైకాపా పాలనలో గ్రూప్-1 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, ఏపీపీఎస్సీ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాలంటే రాజకీయాల్లోనూ మార్పు రావలసిన అవసరం ఉందని, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల పాటు గొడ్డలి పార్టీ విధ్వంసం, నేరాలను నమ్ముకుని అరాచకం సృష్టించిందని.. కలుషిత, నకిలీ మద్యం విక్రయాల వల్ల రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడి రాష్ట్రం సర్వనాశనమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
