Telangana Govt RTC-Metro pass : హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. మెట్రో- ఆర్టీసీ కామన్ పాస్ ధరలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన ..
Telangana Govt RTC-Metro pass : ఆర్టీసీ - మెట్రో ఉమ్మడి పాస్ హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగాఉన్నా.. పాస్ ఛార్జీలు చూస్తే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మంత్రి పొన్నం కీలక ప్రకటన చేశారు.
RTC-Metro pass
Telangana Govt RTC-Metro pass : హైదరాబాద్ నగరంలో ప్రజలకు రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మెట్రో – ఆర్టీసీ సేవలకు కామన్ మొబిలిటీ పాస్‌ను సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీజయంతి రోజున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పాస్‌లను విడుదల చేశారు.
ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్ వల్ల హైదరాబాద్ పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సులతోపాటు మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. ఈ పాస్ ఉంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఎన్నిసార్లు అయినా ప్రయాణించొచ్చు. మెట్రో, ఆర్టీసీ కలిపి ఈ కామన్ పాస్‌ను రూపొందించాయి. దీనివల్ల ప్రతీసారి మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు.. ఒక్కసారి తీసుకుంటే రోజంతా మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు.
ఈ ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్ నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగాఉన్నా.. దీని ఛార్జీలు చూస్తే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో నగర వాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉమ్మడి పాస్ లను తీసుకొనేందుకు విముకత చూపుతున్నారు. ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ. 100గా ఉంది. ఇక నెలవారీ పాస్ ధర రూ.8,500గా ఉండగా.. ఇందులో మెట్రో వాటా రూ.7వేలు, ఆర్టీసీ వాటా రూ.1500గా ఉంది. ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ ధరలను నిర్ణయించిందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్ ధరలపై కీలక ప్రకటన చేశారు.
ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్ ఛార్జీలు మళ్లీ పరిశీలించనున్నట్లు మంత్రి పొన్న ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రోజువారీ పాస్‌కు రూ.400, నెలవారీ పాస్‌కు రూ.8,500 ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయన్న అభిప్రాయాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల నేపథ్యంలో త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. దీంతో త్వరలో ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్ ఛార్జీలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
