Godavari river
Bhadradri Kothagudem Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం నీటి మట్టం 50.20 అడుగులకు చేరింది. రెండు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఔటో ఫ్లో 12 లక్షల 65 వేల, 653 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలతోపాటు ఎగువ నుంచి వరద వస్తోంది.
ఇప్పటికే భద్రాద్రి రామాలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. విస్తా కాంప్లెక్స్, అన్నదానం సత్రం నీటి మునిగిపోయాయి. మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇక భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. కొన్ని కోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది.కరకగూడెంలో 22.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
సత్యనారాయణపురంలో 14.4సెంటీమీటర్లు, సుజాత నగర్ లో 13.8 సెంటీమీటర్లు, ఈ బయ్యారంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. పాత కొత్తగూడెంలో 13.4 సెంటీమీటర్లు, ఇల్లందులో 11.8 సెంటీమీటర్లు, మణుగూరులో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొత్తగూడెంలోని నల్లవాగు ఉఫ్పొంగి 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరద నీరు బ్రిడ్జీ పైనుంచి ప్రమాదకర ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతోపాటు గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించార. ఏదైనా సహాయం కావాల్సి వస్తే పోలీసులకు ఫోన్ చేయాలని తెలిపారు. కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది.
82 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 10 గేట్లు ఎత్తి 57 వేల క్యూసెక్కుల నీటినిదిగువ విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 404 అడుగులకు చేరుకుంది. నాగారం బ్రిడ్జీ వద్ద కిన్నెరసాని ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాల్వంచ, భద్రాచలం మధ్య రాకపోకలను నిలిపి వేశారు.