Heavy rains
Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు కుండపోత వర్షంతో అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అయితే, వచ్చే మూడ్రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
పశ్చిమ, మధ్య వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో బుధవారం యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు, గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని సూచించారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో 11.5 సెంటీమీటర్ల కుపైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి.
విద్యా సంస్థలకు సెలవులు..
భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బుధ, గురువారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా.. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలని ఆదేశించారు. పిల్లలను మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ సూచనలు పాటించండి..
తెలంగాణ వ్యాప్తంగానేకాక హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా నగరవాసులకు హైడ్రా కీలక సూచనలు జారీ చేసింది. భారీ వర్షాలున్న సమయంలో బయటకు రావొద్దు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని హైడ్రా సూచించింది. సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరం పనులు ఉంటేనే బయటకు రావాలని, ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ ఫాలో అవుతూ మీ పనులను షెడ్యూల్ చేసుకోవాలని హైడ్రా సూచించింది. మీ వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని, వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాలని, ముఖ్యంగా.. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జగ్రత్తగా వెళ్లాలని హైడ్రా సూచించింది.